Parliament: భారత్‌లోకి విదేశీ చమురు కంపెనీలు!

by Mahesh Kanagandla |   (  Updated:2025-03-13 04:12:00  IST  )

parliament nod oilfields amendment bill which may pave way for global oil companies భారత్‌లోకి విదేశీ చమురు కంపెనీలు! ఆయిల్‌ఫీల్డ్ బిల్లులో సవరణలకు పార్లమెంటు ఆమోదం

Parliament: భారత్‌లోకి విదేశీ చమురు కంపెనీలు!
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు(Parliament)లో బుధవారమూ ఒక వైపు బిల్లుపై చర్చలు.. మరోవైపు ప్రతిపక్షాల నిరసనలూ కొనసాగాయి. ఆయిల్‌ఫీల్డ్స్(నియంత్రణ, అభివృద్ధి) సవరణ బిల్లు 2024(Oilfield Bill)పై లోక్‌సభ(Loksabha) చర్చించింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ బిల్లులపై ఆందోళనలు, ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చివరికి మూజువాణి ద్వారా ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక రాజ్యసభలో రైల్వే మంత్రిత్వ శాఖ పనిపై చర్చ జరిగింది. అనేక ప్రశ్నలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానాలు ఇవ్వాల్సి ఉన్నది. రెండూ సోమవారానికి వాయిదా పడ్డాయి. హోలీ పండుగ సెలవు కారణంగా ఉభయ సభలు తిరిగి సోమవారం భేటీ కానున్నాయి.

పెట్టుబడులను ప్రోత్సహించేలా..

మన దేశంలో చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించి లీగల్ ఫ్రేమ్‌వర్క్‌ను సవరించే బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. మైనింగ్ కార్యకలాపాల నుంచి పెట్రోలియం ఆపరేషన్స్‌ను వేరుచేసే ఈ బిల్లుకు గతేడాది డిసెంబర్ 3న రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడుతూ కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ప్రభుత్వ, ప్రైవేటురంగాల సంస్థలకు ఈ బిల్లుతో ఎలాంటి నష్టం వాటిల్లబోదని స్పష్టం చేశారు. భారత్‌లో సుస్థిర లీజు గడువు, కార్యకలాపాల స్థితిగతులు, సుస్థిరతలపై అంతర్జాతీయ చమురు కంపెనీలు లేవనెత్తిన ఆందోళనలను నివారించేలా ఈ చట్టంలో సవరణలతో బిల్లును రూపొందించామని వివరించారు. రాష్ట్రాల హక్కులనూ ఈ బిల్లు ఏమాత్రం భంగపరచదని, పెట్రోలియం లీజులు ఇస్తూ ఎప్పటిలాగే రాయల్టీలు పొందవచ్చని స్పష్టతనిచ్చారు. ఈ బిల్లు ద్వారా దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెంచుకుని దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వివరించారు. వివాదాలు ఉల్లంఘనలకు శిక్షించడం కంటే ద్రవ్యపరమైన జరిమానాలు విధించడం మంచిదని, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సంస్థల వద్ద వివాద పరిష్కారానికి అవకాశాలు ఈ బిల్లు ద్వారా కల్పించామని పేర్కొన్నారు. అలాగే, ఎప్పట్లాగే దిగుమతులు కొనసాగిస్తామని, దిగుమతి నిర్ణయాల్లో అందుబాటు, చౌక, సుస్థిరతలు చమురు కీలకమని, వీటిని ఇప్పటి వరకు సరిగ్గా అంచనా వేసి నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. గతమూడేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన ఏకైక దేశం భారత్ మాత్రమేనని, ప్రధాని మోడీ రెండుసార్లు కేంద్ర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించారని తెలిపారు.

కార్పొరేట్ల లబ్ది కోసమేనా..

మన దేశంలో ఓఎన్‌జీసీ వంటి ఆయిల్ మేకింగ్ కంపెనీలు లాభాల్లో ఉన్నా కొత్తగా బిల్లుకు సవరణలు చేయాల్సిన అవసరం ఏమున్నదని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామశంకర్ రాజ్‌భర్ ప్రశ్నించారు. భారత పెట్రోలియం వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టాలని, వారికి లబ్ది సమకూర్చాలనే లక్ష్యంతోనే ఈ సవరణలు తెచ్చారా? అని అడిగారు. చమురు ధరలు తగ్గించే, ఈ రంగంలో భారత్ స్వయం సమృద్ధత సాధించే వైపుగా ఏ నిర్ణయాలూ కేంద్రం తీసుకోవడం లేదా? అని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో భారత్‌ చౌకగా చమురు పొంది లబ్దిపొందిందని, కానీ, ఈ పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండబోవని, కాబట్టి, స్వయం సమృద్ధి సాధించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ మనోజ్ తివారీ పేర్కొన్నారు. ఈ బిల్లులో దీర్ఘదృష్టితో తీసుకున్న నిర్ణయాలేవీ కనిపించడం లేదని వాపోయారు. చమురు వనరులను ప్రైవేటు కంపెనీలకే వదిలిపెడితే వాటి లాభాలే చూసుకుని పర్యావరణ విధ్వంసానికి పాల్పడితే పరిస్థితి ఏమిటని తృణమూల్ ఎంపీ ప్రతిమా మొండల్ ప్రశ్నించారు.

సమాంతరంగా రైల్వేను ఎందుకు అభివృద్ధి చేయలేదు?

రాజ్యసభలో భారత రైల్వేపై చర్చ జరిగింది. ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ భారత రైల్వే అభివృద్ధిపై కీలక ప్రశ్నలు వేశారు. భారత రైల్వే కేవలం నగరాలనే కాదు.. దేశ చరిత్రను, వర్తమానాన్ని కలిపే వాహకాలని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో, దేశ విభజనలో ఇవే ట్రైన్లు ఉన్నాయని గుర్తు చేశారు. బ్రిటీష్‌వారు వెళ్లిపోయాక కొత్తగా కేవలం 25 నుంచి 30 శాతం నెట్‌వర్క్‌ను మాత్రమే మన ప్రభుత్వాలు విస్తరించాయని, దేశ ఆర్థికాభివృద్ధికి సమాంతరంగా రైల్వేను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ రైల్వే వ్యవస్థ ప్రపంచ అతిపెద్ద వ్యవస్థగా కాకుండా.. మూడో అతిపెద్ద వ్యవస్థ ఎందుకు ఉన్నదని ప్రశ్నించారు. దేశంలో కేవలం 500 రైల్వే స్టేషన్‌లలో మాత్రమే వికలాంగులకు సదుపాయాలున్నాయని, టికెటింగ్ వ్యవస్థ ఇప్పటికీ గాడిలోకి రాలేదని విమర్శించారు. వెయిటింగ్ లిస్టు రాజధాని ఎక్స్‌ప్రెస్ సామర్థ్యమంతా ఉన్నదని మండిపడ్డారు. అదే విధంగా లాభాల కన్నా ఖర్చు ఎందుకు పెరిగిందనీ ప్రశ్నించారు. రైల్వే లాభాలు లక్ష్యంగా పెట్టిన వాణిజ్య వ్యవస్థ కాదని, ఇది సేవా రంగంలోకి వస్తుందని ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ వివరించారు. ప్రజల సొమ్ము తీసుకునే కోణంలో నిర్ణయాలు ఉండొద్దని పేర్కొన్నారు. రైల్వేలో అనేక ఖాళీలు పెండింగ్‌లోనే ఉన్నాయని, బయటేమో కోట్లాది యువత నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమవారం సమాధానాలు ఇవ్వనున్నారు.

మరోసారి ఏకమైన ప్రతిపక్షాలు

చెల్లాచెదురైన ప్రతిపక్షాలు నకిలీ ఓటర్ల అంశంలో ఏకమయ్యాయి. దేశవ్యాప్తంగా ఒకే ఓటరు నెంబర్‌‌తో అనేక కార్డులు జారీ చేశారని, ఇది ఎన్నికల ప్రక్రియపైనే తీవ్ర అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ప్రతిపక్షాలు లోక్‌సభ, రాజ్యసభల్లో మండిపడ్డాయి. ఎన్నికల సంఘం వెంటనే ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ అంశంపై చర్చకు అనుమతించాలని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియన్ కోరారు. రాజ్యసభలో ఈ అంశాన్ని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా లేవనెత్తారు. కాగా, డీలిమిటేషన్‌పైనా ప్రతిపక్ష పార్టీలు ఒకే అభిప్రాయంతో గళమెత్తాయి. తమిళనాడు డీఎంకే పార్టీతో మద్దతుగా నిరసనలు చేశాయి. ఒడిశా బీజేడీతోపాటు ఇతర పలుప్రతిపక్ష పార్టీలూ ఈ అంశాన్ని లేవనెత్తాయి.

Next Story