'మెలోడీ' వీడియోతో అమాంతం పెరిగిన షేర్స్.. పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు

by Prasad Jukanti |   (  Updated:2026-05-20 11:01:02  IST  )

ప్రధాని మోడీ, ఇటలీ ప్రధాని మెలోని 'మెలోడీ' వైరల్ వీడియోతో పార్లే ఇండస్ట్రీస్ షేరు 5 శాతం పెరిగింది. అయితే చిన్న పొరపాటుతో ఇన్వెస్టర్లు దెబ్బైపోయారు.

మెలోడీ వీడియోతో అమాంతం పెరిగిన షేర్స్.. పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ఐదు దేశాల పర్యటన విజయవంతమైంది. అంతర్జాతీయ వేదికపై భారత ఆర్థిక, రక్షణ ప్రయోజనాలను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేలా సాగిన ఈ పర్యటనలో చివరిదైన ఇటలి పర్యటన సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది. ఈ టూర్ లోభాగంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ప్రధాని మోడీ మధ్య సరదా క్షణం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బజ్ క్రియేట్ చేస్తోంది. సాధారణంగా ఈ ఇద్దరు నేతల మధ్య మంచి స్నేహపూర్వక వాతావరణం ఉంది. దీంతో ఈ ఇద్దరు నేతలు ఎక్కడా భేటీ అయినా ‘మెలోడీ’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజా పర్యటనలో భాగంగా మోడీ ఇటలీ ప్రధానికి మెలోడీ టాఫీల(చాక్లెట్స్) ఫ్యాకెట్ బహుమతిగా ఇవ్వడంతో ఆసక్తిగా మారింది. దీంతో ఆన్‍లైన్‍లో మరోసారి మెలోడీ ట్రెండ్ పుంజుకుంది. ఈ దెబ్బతో పార్లె ఇండస్ట్రీ షేర్లు అమాంతం పెరిగిపోయాయి. మోడీ-మెలోని క్యూట్ మూవ్‍మెంట్ సదరు చాక్లెట్ సంస్థకు కొత్త ఊపిరి పోస్తుండగా ఈ షేర్ల వెనుక ఉన్న ట్విస్ట్ మాత్రం షేర్లు కొనుగోలు చేసిన వారితో పాటు ప్రజలను ఆశ్చర్యంలోకి నెట్టుతోంది.

5 శాతం పెరిగిన షేర్లు.. కానీ:

మోడీ, మెలోని వీడియో వైరల్ కావడంతో పార్లే ఇండస్ట్రీస్ (Parle Industries) షేర్లను తెగ కొనుగోలు చేశారు. దీంతో ఆ కంపెనీ షేర్ విలువ ఒక్కసారిగా 5 శాతం పెరిగింది. అయితే స్టాక్ మార్కెట్‌లోని ఇన్వెస్టర్లు తొందరపడి కొన్న 'పార్లే ఇండస్ట్రీస్' కంపెనీకి మెలోడీ చాక్లెట్‌కు ఎలాంటి సంబంధం లేదనే విషయం గ్రహించి నాలుక కరుచుకుంటున్నారు. మెలోడీ చాక్లెట్స్ 'పార్లే ప్రొడక్ట్స్' (Parle Products) సంస్థ తయారు చేస్తోంది. దీనితో పాటు

పార్లే-జి, మొనాకో, క్రాక్‌జాక్, మ్యాంగో బైట్ వంటి బ్రాండ్లు అన్నీ ఈ సంస్థవే. ఇది ప్రైవేట్ కంపెనీ కావడంతో పాటు దీనికి స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ లేదు. కానీ ఇన్వెస్టర్లు కన్ఫ్యూజ్ అయి 'పార్లే ఇండస్ట్రీస్' (Parle Industries) షేర్లు కొనుగోలు చేశారు. ఇది పార్లే ప్రొడక్ట్స్ కంపెనీకి పూర్తిగా వేరే కంపెనీ. కేవలం పేరులో 'పార్లే' అని ఉండటంతో కన్ఫ్యూజ్ అయిన ఇన్వెస్టర్లు మెలోడీ చాక్లెట్స్ తయారూ చేస్తున్న పార్లే ప్రొడక్ట్స్ కు బదులు పొరపాటున పార్లే ఇండస్ట్రీస్ స్టాక్ కొనుగోలు చేసేశారు.

చాలా కాలంగా లాస్ లోనే:

సోషల్ మీడియాలో మోడీ, మెలోని బజ్ వల్ల 'పార్లే ఇండస్ట్రీస్' షేర్ల విలువ తాత్కాలికంగా పెరిగినప్పటికీ లాంగ్ టర్మ్‌లో ఈ కంపెనీ పనితీరు ఏమాత్రం బాగాలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. పార్లే ఇండస్ట్రీస్ షేర్లు గత 3 నెలల్లో 41 శాతం, 6 నెలల్లో 46 శాతం, గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 68 శాతానికి పైగా నష్టపోయింది. కేవలం కంపెనీ పేర్లు ఒకేలా ఉన్నాయని లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయని ఎలాంటి అవగాహన లేకుండా షేర్లు కొంటే ఇన్వెస్టర్లు ఎలా నష్టపోతారో చెప్పడానికి ఈ 'మెలోడీ' ఘటనే ఒక పెద్ద ఉదాహరణ అని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Next Story