Panama: పనామాకు అక్రమ వలసదారులు.. దౌత్య, రవాణా సమస్యలతో హోటల్‌లోనే నిర్భంధం !

by B.Srinivas |   (  Updated:2025-02-19 18:03:33  IST  )

అమెరికా నుంచి బహిష్కరించిన 300 మంది అక్రమ వలసదారులు పనామా చేరుకున్నారు. వారందరినీ ఒక హోటళ్లో ఉంచినట్టు పనామా తెలిపింది.

Panama: పనామాకు అక్రమ వలసదారులు.. దౌత్య, రవాణా సమస్యలతో హోటల్‌లోనే నిర్భంధం !
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా నుంచి బహిష్కరించిన 300 మంది అక్రమ వలసదారులు పనామా చేరుకున్నారు. వారందరినీ ఒక హోటల్‌లో ఉంచినట్టు పనామా తెలిపింది. వీరిలో భారత్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాతో సహా పది ఆసియా దేశాల నుంచి వచ్చిన ఈ వలసదారులు ఉన్నారు. కానీ రవాణా, దౌత్య పరమైన సవాళ్ల కారణంగా వారు నేరుగా స్వదేశాలకు తిరిగి రాలేకపోతున్నారని తెలుస్తోంది. పనామా చేరుకున్న వలసదారుల్లో 30 మంది భారతీయులు ఉన్నారు. అయితే పలు సమస్యల వల్ల వారు హోటల్ గదులకే పరిమితం అయ్యారు. వారందరికీ వైద్య సాయం, ఆహారం అందిస్తున్నట్టు పనామా అధికారులు తెలిపారు.

వలసదారులను నిర్భందించడం లేదని పనామా భద్రతా మంత్రి ఫ్రాంక్ అబ్రెగో స్పష్టం చేశారు. వారిని స్వదేశాలకు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. వలసదారుల్లో 171 మంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ సహాయంతో స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి అంగీకరించారని తెలిపారు. మిగిలిన 128 మంది స్వస్థలాలను కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. స్వచ్ఛందంగా స్వదేశానికి తిరిగి వెళ్లడానికి నిరాకరించే వారిని పనామాలోని డారియన్ ప్రావిన్స్‌లోని శిబిరానికి తరలించాలని పనామా యోచిస్తోంది.

కాగా, పశ్చిమాసియా దేశాలకు చెందిన వారిని నేరుగా వారి స్వదేశాలకు పంపించడం అమెరికాకు కష్టం కాబట్టి పనామాతో ఒప్పందం చేసుకున్నారు. యూఎస్ నుంచి బహిష్కరణకు గురైన వారికి రవాణా దేశంగా పనామా పనిచేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని ఖర్చులను అమెరికా భరిస్తోంది. ఈ నెల ప్రారంభంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది.

Next Story