IWT: పాక్‌పై సింధు జలాల ఎఫెక్ట్.. 15 శాతం తగ్గిన నీటి ప్రవాహం

by S Gopi |

ఈ భారీ తగ్గుదల కారణంగా ప్రధాన జలాశయాలు వాటి డెడ్ స్టోరేజీ స్థాయిలకు పడిపోయాయి.

IWT: పాక్‌పై సింధు జలాల ఎఫెక్ట్.. 15 శాతం తగ్గిన నీటి ప్రవాహం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, మనదేశంపై దాడులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పేందుకు ఇటీవల భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసిన సంగతి తెలిసిందే. దీనివల్ల ప్రస్తుతం పాకిస్తాన్‌లోని సింధూ నదీ పరీవాహక ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా పడిపోయిందని ఆదివారం పలు నివేదికలు వెల్లడించాయి. గతేడాదితో పోలిస్తే ఇదే సమయంలో కీలక ఆనకట్టల నుంచి విడుదలయ్యే నీటి పరిమాణం 15 శాతం మేర క్షీణించినట్టు అధికారిక గణాంకాలు తెలిపాయి. ఈ భారీ తగ్గుదల కారణంగా ప్రధాన జలాశయాలు వాటి డెడ్ స్టోరేజీ స్థాయిలకు పడిపోయాయి. ఖరీఫ్ పంటల సీజన్‌కు ముందు ఈ పరిస్థితి పాకిస్తాన్‌లో ఆందోళన కలిగిస్తోంది. జూన్ 5న పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో విడుదల చేసిన మొత్తం నీరు 1.24 లక్షల క్యూసెక్కులు. గతేడాది ఇదే తేదీన నమోదైన 1.44 లక్షల క్యూసెక్కుల కంటే తగ్గింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా ఆనకట్ట వద్ద నీటి మట్టం 1,465 మీటర్లకు చేరింది. ఇది డెడ్ స్టోరేజ్ స్థాయి 1,402 మీటర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంది.

3,064 క్యూసెక్కులకు చీనాబ్ నది

పంజాబ్‌లోని సింధు నదీ తీరంలోని చస్మా ఆనకట్టలో నీరు 644 మీటర్ల వద్ద ఉంది, దాని డెడ్ స్టోరేజీ లెవల్ 638 మీటర్లకు దగ్గరగా ఉంది. మీర్‌పూర్‌లోని జీలం వద్ద ఉన్న మంగ్లా ఆనకట్టలో కూడ నీటి మట్టం 1,163 మీటర్లకు పడిపోయింది, దాని డెడ్ స్టోరేజీ 1,050 మీటర్లకు దగ్గరగా ఉంది. సియాల్‌కోట్‌లోని మరాలా వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంది, ఇక్కడ మే 28న 26,645 క్యూసెక్కులుగా ఉన్న చీనాబ్ నది సగటు నీటి విడుదల జూన్ 5 నాటికి కేవలం 3,064 క్యూసెక్కులకు పడిపోయిందని నివేదికలు పేర్కొన్నాయి. ఆనకట్టల్లో డెడ్ స్టోరేజ్ కంటే తక్కువగా నీటి మట్టం ఉంటే, గురుత్వాకర్షణ కారణంగా జలాశయం నుంచి నీటిని విడుదల చేయడం వీలవదు.

ఖరీఫ్ పంటలపై ప్రభావం

మరోవైపు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్ సీజన్ కావడంతో పాకిస్తాన్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఒక ప్రభుత్వ అధికారి తెలిపారు. ఖరీఫ్ సీజన్ వేళ పాకిస్తాన్ 21 శాతం నీటి కొరత ఏర్పడవచ్చని అంచనా వేస్తోంది. ఈ కొరత దేశంలోని ఆహార కేంద్రంగా ఉన్న పంజాబ్‌లో వ్యవసాయ ఉత్పత్తిని ప్రమాదంలో పడేస్తుంది. నీటి కొరతతో పాటు జూన్ 8 నుంచి పాకిస్తాన్‌లోని కీలక ప్రాంతాలలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయనే అంచనాలు ఆందోళనలను పెంచుతోంది. మధ్య, ఎగువ పంజాబ్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-7 డిగ్రీలు పెరుగుతాయని అంచనా.

పాక్ లేఖల పర్వం

ఇక, సింధు జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసినప్పటి నుంచి, పాకిస్తాన్ ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని న్యూఢిల్లీకి అనేకసార్లు లేఖ రాసింది. పాకిస్తాన్ జల వనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు 4 సార్లు రాసినట్లు హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాసిన ఈ లేఖలలో ముర్తాజా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలనే నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది. భారత్ ఏకపక్షంగా ఒప్పందాన్ని నిలిపివేయలేదని, ఇది ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘిస్తుందని పాకిస్తాన్ పదే పదే ప్రస్తావిస్తోంది. కానీ, ఏప్రిల్ 24న పాకిస్తాన్‌కు ఈ ఒప్పందాన్ని నిలుపుదల చేయాలనే తన నిర్ణయాన్ని భారతదేశం అధికారికంగా తెలియజేసింది. దీనికి పరిష్కారం చేసుకుందామని పాక్ కోరుతున్నప్పటికీ, భారత్ తన వైఖరి పట్ల స్థిరంగానే ఉంది. సరిహద్దు ఉగ్రవాదాన్ని విరమించుకునే వరకు దీనిపై వేరే చర్చలు ఉండవని స్పష్టం చేస్తోంది.

Next Story