భారత్ పై భారీ ఉగ్రదాడికి పాక్ కుట్ర.. మాస్టర్ మైండ్ మునీర్? : హెచ్చరించిన నిఘా వర్గాలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-01 11:52:09  IST  )

భారత్ పై ఉగ్రదాడులకు పాక్ మరోసారి భారీగా ప్లాన్ చేస్తున్నట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి. దీనివెనుక అసిమ్ మునీర్ ఉన్నట్లు సమాచారం.

భారత్ పై భారీ ఉగ్రదాడికి పాక్ కుట్ర.. మాస్టర్ మైండ్ మునీర్? : హెచ్చరించిన నిఘా వర్గాలు
X

దిశ, వెబ్‍డెస్క్: పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి భారత్‌పై దుశ్చర్యకు ఒడిగట్టేలా కనిపిస్తోంది. తీవ్ర నిరాశలో ఉన్న పాక్ సైన్యం, భారత భూభాగంపై సాహసోపేతమైన దాడికి ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాల విశ్లేషణలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని, తద్వారా అమెరికాను ఈ వివాదంలోకి లాగాలని పాక్ ప్లాన్ చేస్తోందని షిల్లాంగ్ టైమ్స్ వెల్లడించింది.

పాక్ చిరకాల వాంఛే అసలు లక్ష్యం

గతంలో 'ఆపరేషన్ సిందూర్' సమయంలో భారత్ ఏ విధంగానైతే ధీటుగా స్పందించిందో, ఇప్పుడు కూడా భారత్ అలాగే ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కోరుకుంటోంది. భారత్ ఎదురుదాడి చేస్తే, ఆ సాకుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న సంబంధాలను వాడుకుని అంతర్జాతీయ జోక్యాన్ని కోరాలని పాక్ భావిస్తోంది. కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావాలనేది పాకిస్థాన్ చిరకాల వాంఛ. అయితే.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ తమ అంతర్గత విషయమని భారత్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది.

అసిమ్ మునీర్ రాజకీయ ఆకాంక్షలు

పాక్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ప్రతిష్ట ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తన దేశంలో పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి భారత్‌పై ఏదైనా పెద్ద దాడి చేయాలని ఆయన చూస్తున్నారు. అంతేకాకుండా, పాకిస్థాన్ అధ్యక్ష పీఠాన్ని అధిష్టించాలని ఆయన కలలు కంటున్నారు. కాశ్మీర్ అంశాన్ని రగిలించడం ద్వారా తాను దేశ రక్షకుడినని ప్రజలకు చాటిచెప్పాలని మునీర్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మునీర్ ద్విముఖ వ్యూహం (Two-Pronged Strategy)

మునీర్ ప్రస్తుతం రెండు రకాల వ్యూహాలను అమలు చేస్తున్నారు. స్థానిక ఉగ్ర మాడ్యూల్స్ తో లోయలో చిన్న చిన్న దాడులు చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనివల్ల పర్యాటక రంగం దెబ్బతినడమే కాకుండా, సరిహద్దుల వద్ద ఉన్న భద్రతా దళాల దృష్టి లోపలికి మళ్లుతుంది. భద్రతా దళాల దృష్టి మళ్లిన తర్వాత, సరిహద్దుల్లోని లాంచ్ ప్యాడ్‌ల వద్ద వేచి ఉన్న పాక్ ఉగ్రవాదులను చొప్పించి పెద్ద ఎత్తున దాడి చేయాలన్నది నెక్స్ట్ ప్లాన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. భారత సైన్యం ప్రతీకార దాడి చేస్తే, పాక్ తన భూభాగంలోని ఉగ్ర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నా పర్వాలేదని భావిస్తోంది. తద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి కాశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం కోరవచ్చనేది మునీర్ ఆడుతున్న ప్రమాదకరమైన గేమ్ గా జాతీయ మీడియా పేర్కొంది.

పాకిస్తాన్‌కు చైనా సబ్‌మెరైన్లు

Next Story