US Threat Assessment Report: భారత్ ని అస్తిత్వ ముప్పుగా చూస్తున్న పాక్

by Shamantha N |

పాకిస్థాన్ భారతదేశాన్ని "అస్తిత్వ ముప్పు"గా చూస్తుందని అమెరికా పేర్కొంది. వరల్డ్ త్రెట్ అసెస్ మెంట్ నివేదికను అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసింది.

US Threat Assessment Report: భారత్ ని అస్తిత్వ ముప్పుగా చూస్తున్న పాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ భారతదేశాన్ని "అస్తిత్వ ముప్పు"గా చూస్తుందని అమెరికా పేర్కొంది. వరల్డ్ త్రెట్ అసెస్ మెంట్ నివేదికను అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ విడుదల చేసింది. చైనా ఆర్థిక సాయంతో పాక్ తన ఆయుధాలను ఆధునికీకరిస్తున్నట్లు పేర్కొంది. "పాకిస్తాన్ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది. న్యూక్లియర్ వెపన్స్ భద్రత, నియంత్రనను నిర్వహిస్తుంది. అంతేకాకుండా, విదేశీ సరఫరాదారులు, మధ్యవర్తుల నుంచి విధ్వంసం సృష్టించే ఆయుధాలు కొనుగోలు చేస్తుంది" అని నివేదిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. చైనా పాక్ కు సైనిక పరికరాల ప్రధాన సరఫరాదారుగా ఉన్నప్పటికీ.. అక్కడ పనిచేస్తున్న చైనీయులను లక్ష్యంగా చేసుకుని వరుసగా ఉగ్రవాద దాడులు జరగడం వల్ల ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయంది. ఇది రెండు మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతకు దారితీస్తుందంది. అంతేకాకుండా, భారతదేశాన్ని పాక్ తన ఉనికికి ముప్పుగా భావిస్తుందని పేర్కొంది. భారతదేశ సంప్రదాయ సైనిక ప్రయోజనాన్ని భర్తీ చేయడానికి అణ్వాయుధాల అభివృద్ధితో సహా దాని సైనిక ఆధునీకరణ ప్రయత్నాలను కొనసాగిస్తుందని పేర్కొంది.

భారత్ గురించి ఏమందంటే?

రక్షణ ప్రాధాన్యతలు, ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించడం, చైనాను ఎదుర్కోవడం, సైనిక శక్తిని పెంచడంపై భారత్ దృష్టి సారిస్తాయని వరల్డ్ త్రెట్ అసెస్ మెంట్ నివేదిక అంచనా వేసింది. "భారతదేశం చైనాను తన ప్రాథమిక శత్రువుగా చూస్తుంది. పాకిస్థాన్ ను సరిహద్దుల అంశంగా, సహాయక భద్రతా సమస్యగా చూస్తుంది" అని నివేదిక పేర్కొంది. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రయత్నంలో హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి భారతదేశం ప్రాధాన్యత ఇస్తోందంది. భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల్లో పురోగతిని కూడా నివేదిక పేర్కొంది. తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి మిగిలిన రెండు ఘర్షణ పాయింట్ల నుండి దళాలను విరమించుకోవడానికి రెండు దేశాలు అంగీకరించినప్పటికీ, అంతర్లీన సరిహద్దు విభజన వివాదం ఇంకా పరిష్కారం కాలేదంది. సైన్యాన్ని ఆధునీకరించడానికి తన "మేడ్ ఇన్ ఇండియా" చొరవను ముందుకు తీసుకెళ్లాలని భారత్ భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అగ్ని-I ప్రైమ్ మీడియం-రేంజ్ బాలిస్టిక్ క్షిపణి (MRBM), అగ్ని-V పరీక్ష, సెకండ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్ మెరైన్ ను కూడా నివేదిక హైలెట్ చేసింది. రష్యన్ రక్షణ వ్యవస్థల సేకరణను తగ్గించినప్పటికీ, రష్యన్ విడిభాగాలపై ఆధారపడి ఉండటంతో భారతదేశం రష్యాతో తన వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది.

Next Story