India-Pak: ఏడోరోజు కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం

by S Gopi |

ఈ కాల్పులు తరచూ ఉద్రిక్తంగా ఉండే కుప్వారా, అఖ్నూర్, ఉరి సెక్టార్లలో జరిగాయి.

India-Pak: ఏడోరోజు కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్.. ధీటుగా బదులిచ్చిన భారత సైన్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. బుధవారం అర్ధరాత్రి పాకిస్తాన్ దళాలు ఎల్ఓసీ వద్ద మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. అందుకు బదులిచ్చిన మన సైన్యం పాకిస్తాన్ దళాలపై ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. తాజాగా ఏడోరోజు ఎల్ఓసీ వద్ద తెల్లవారుజామున పాక్ దళాలు ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఈ కాల్పులు తరచూ ఉద్రిక్తంగా ఉండే కుప్వారా, అఖ్నూర్, ఉరి సెక్టార్లలో జరిగాయి. నౌషేరా, సునర్‌బని, అఖ్నూర్ సెక్టార్లలో ఉన్న ఎల్ఓసీ వెంబడి పాక్ ఆర్మీ చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపాయి. వేగంగా స్పందించిన భారత సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. పెహల్‌గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. ఇప్పటికే భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు సహా కఠిన చర్యలు తీసుకుంది. తాజాగా మహిరా ఖాన్, హనియా అమీర్, అలీ జాఫర్ సహా అనేక మంది పాక్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసింది.

అమెరికా నుంచి ఫోన్..

భారత్, పాక్ మధ్య వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌లతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించి శాంతి భద్రతలను కాపాడాలని కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఏ చర్యలకినా సహకారం ఉంటుందని ఈ సందర్భంగా జైశంకర్‌తో రూబియో అన్నారు. ఇదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించి, దక్షిణాసియాలో శాంతిభద్రతల కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాలన్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్‌ వెల్లడించారు.

Next Story