దంగల్ నిషేధంపై పాక్ మంత్రి పశ్చాత్తాపం.. కండీషన్స్ పై స్పందించిన అమీర్ ఖాన్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-26 21:16:10  IST  )

భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ‘దంగల్’(Dangal) ఒకటి. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దంగల్ నిషేధంపై పాక్ మంత్రి పశ్చాత్తాపం.. కండీషన్స్ పై స్పందించిన అమీర్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ‘దంగల్’(Dangal) ఒకటి. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే పాకిస్థాన్‌లో మాత్రం ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఈ విషయంపై పాకిస్థాన్ మాజీ సమాచార శాఖ మంత్రి, ప్రస్తుత పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ స్పందిస్తూ తన నిర్ణయంపై తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజుల్లో ‘దంగల్’ విడుదలైందని, ఆ సమయంలోనే అధికారులు ఈ సినిమాపై నిషేధాన్ని సిఫారసు చేశారని గుర్తు చేసుకున్నారు. “ఆ సినిమాను నేను చూడకుండానే నిషేధానికి అంగీకరించాను. అది నా రాజకీయ జీవితంలో చేసిన ఒక బాధాకరమైన తప్పు” అని ఆమె అంగీకరించారు.

ఆపై సుమారు 18 నెలల తర్వాత ఆమె ‘దంగల్’ సినిమాను చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. “ఈ చిత్రం బాలికలకు ఎంతో స్ఫూర్తినిచ్చే కథ. అలాంటి సినిమాను నిషేధించడం నిజంగా నన్ను కలచివేసింది,” అంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ సెన్సార్ బోర్డు కొన్ని షరతులతో సినిమాను ఆమోదించాలని కోరిందని తెలిపారు. భారత జాతీయ గీతం వినిపించే దృశ్యాన్ని, జాతీయ పతాకం కనిపించే భాగాన్ని తొలగించాలని వారు చెప్పారని వెల్లడించారు. అయితే “నా దేశ గౌరవానికి విరుద్ధంగా ఏ మార్పు కూడా నేను అంగీకరించలేదు. నా నిర్ణయం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడినా సరే, దేశం మీద ప్రేమకు లోటుండకూడదని నేను నమ్ముతాను.” అని అమీర్ స్పష్టంగా తెలిపారు. ఈ సంఘటనను ఇప్పుడు మరల ప్రస్తావించడంలో భావప్రకటన స్వేచ్ఛ, దేశ గౌరవం, ప్రజల స్ఫూర్తిదాయక చిత్రాల ప్రాధాన్యత వంటి అంశాలకు ఎంత ప్రాధాన్యమిస్తారో స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story