Indian Army: సరిహద్దుల్లో చొరబాటు యత్నించిన ఏడుగురు హతం

by Shamantha N |

సరిహద్దుల్లో చొరబాటు యత్నాన్ని భారత సైన్యం(Indian Army) భగ్నం చేసింది. వాస్తవాధీన రేఖ (LoC) వెంబడి భారత భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిన ఏడుగురు పాక్ చొరబాటుదారుల్ని(infiltrators) హతమార్చింది.

Indian Army: సరిహద్దుల్లో చొరబాటు యత్నించిన ఏడుగురు హతం
X

దిశ, నేషనల్ బ్యూరో: సరిహద్దుల్లో చొరబాటు యత్నాన్ని భారత సైన్యం(Indian Army) భగ్నం చేసింది. వాస్తవాధీన రేఖ (LoC) వెంబడి భారత భూభాగంలోకి వచ్చేందుకు యత్నించిన ఏడుగురు పాక్ చొరబాటుదారుల్ని(infiltrators) హతమార్చింది. ఫిబ్రవరి 5 తెల్లవారుజామును ముగ్గురు పాక్ ఆర్మీ సిబ్బంది సహా ఏడుగురిని కాల్చి చంపినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. జమ్ముకశ్మీర్‌ పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది. భారత వ్యతిరేక ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు 'కశ్మీర్ సాలిడారిటీ డే'ను పాక్ నిర్వహిస్తున్న సమయంలో ఈ చొరబాటు యత్నం జరిగింది. భారత సైన్యం ఫార్వర్డ్ పోస్ట్‌పై దాడి చేయడానికి సరిహద్దు కార్యకలాపాలకు ప్రత్యేక విభాగాలైన పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం (BAT)పై మెరుపుదాడి చేసిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. చనిపోయిన ఏడుగురిలో 2-3 మంది పాకిస్తాన్ ఆర్మీ రెగ్యులర్స్ అని వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో చనిపోయిన ఉగ్రవాదులు అల్-బదర్ గ్రూపు సభ్యులు కావచ్చని అనుమానిస్తుంది..

పాక్ ప్రధాని ప్రకటన

ఈ వారం ప్రారంభంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. కశ్మీర్‌తో సహా అన్ని సమస్యలను చర్చల ద్వారా భారత్ తో పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతే కాకుండా, జైష్-ఎ-మొహమ్మద్ (JeM) లష్కరే-ఎ-తోయిబా (LeT) వంటి ఉగ్రసంస్థల కమాండర్లు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమయంలోనే పాక్ ప్రధాని ప్రకటన చేయడం గమనార్హం. 2019లో నరేంద్ర మోడీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుండి రెండు దేశాల మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు తెగిపోయాయి. ఇకపోతే, ఇటీవలికాలంలో జమ్ము ప్రాంతంలోని వివిధ జిల్లాల్లో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయి. ఉగ్రదాడుల్లో 18 మంది భద్రతా సిబ్బందితో సహా 44 మంది మరణించారు.

Next Story