వేట కొనసాగుతోంది..మరో ఉగ్రవాది ఇంటిని లేపేసిన ఇండియన్ ఆర్మీ

by Bhanu |

పహల్గామ్‌లో జరిగిన భయానక ఉగ్రదాడి అనంతరం, జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా బలగాలు భారీగా తనిఖీలు చేపట్టాయి.

వేట కొనసాగుతోంది..మరో ఉగ్రవాది ఇంటిని లేపేసిన ఇండియన్ ఆర్మీ
X

దిశ, వెబ్ డెస్క్: పహల్గామ్‌లో జరిగిన భయానక ఉగ్రదాడి అనంతరం, జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా బలగాలు భారీగా తనిఖీలు చేపట్టాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతమైన శోధన కొనసాగుతోంది. ముఖ్యంగా ఉగ్రవాదులకు సహకరించిన వారిపై చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గత 48 గంటల్లో భద్రతా బలగాలు, స్థానిక యంత్రాంగం అనేక ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేసి, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో వేగం పెంచాయి. తాజాగా, పాకిస్తాన్‌లో తలదాచుకున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్‌కు చెందిన కుప్వారా జిల్లాలోని ఇంటిని పేల్చేశారు. ఇది పహల్గామ్ దాడి తర్వాత ఆరవ ఘటన కావడం గమనార్హం. ఇప్పటి వరకు భద్రతా బలగాలు మొత్తం ఆరుగురు ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేశాయి. ఫరూఖ్ ఇంటితో పాటు, అనేకమంది ఇతర ఉగ్రవాదులకు సంబంధించిన ఆస్తులను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి.

ఈ పరంపరలో, అనంత్‌నాగ్ జిల్లా థోకర్‌పూరాలో ఆదిల్ అహ్మద్ థోకర్, పుల్వామాలోని ముర్రాన్ ప్రాంతానికి చెందిన అహ్సాన్ ఉల్ హక్ షేక్, త్రాల్‌లో ఆసిఫ్ అహ్మద్ షేక్, షోఫియాన్ జిల్లా చోటి పురాకు చెందిన షాహిద్ అహ్మద్ కుట్టాయ్, కుల్గామ్‌లో మతల్హామాకు చెందిన అహ్మద్ గనీ ఇళ్లను ఇప్పటికే కూల్చేశారు. శుక్రవారం నాడు, పహల్గామ్ దాడిలో ప్రమేయం ఉన్న ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లను కూడా ధ్వంసం చేశారు. ఇవాళ బిజ్‌బెహారాలో ఆదిల్ హుస్సేన్ థోకర్ ఇంటిని IEDల ద్వారా పేల్చివేయగా, త్రాల్‌లో ఆసిఫ్ షేక్ నివాసాన్ని బుల్డోజర్‌తో కూల్చివేశారు.

పహల్గామ్ బైసరన్ లోయ అందాలను వీక్షించేందుకు వచ్చిన హిందూ మతానికి చెందిన పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి సంబంధించి ఆదిల్ థోకర్ ముఖ్య పాత్ర పోషించాడని అధికారులు అనుమానిస్తున్నారు. 2018లో పంజాబ్ అట్టారి-వాఘా సరిహద్దు మార్గంగా పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన థోకర్, అక్కడ ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొందినట్టు సమాచారం. అనంతరం, గత సంవత్సరం అతను కాశ్మీర్‌లోకి చొరబడినట్లు సమాచారం.

Next Story