Pahalgam Terror Attack :పహెల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఎన్ఐఏకు కీలక ఆధారం

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి కేసు అధికారికంగా ఎన్ఐఏ చేతికి వెళ్లిన కొద్దిసేపటికే అత్యంత కీలకమైన ఆధారం లభ్యమయ్యింది.

Pahalgam Terror Attack :పహెల్గాం ఉగ్రదాడికి సంబంధించిన ఎన్ఐఏకు కీలక ఆధారం
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి కేసు అధికారికంగా ఎన్ఐఏ చేతికి వెళ్లిన కొద్దిసేపటికే అత్యంత కీలకమైన ఆధారం లభ్యమయ్యింది. బైసరన్‌కు వచ్చే టూరిస్టుల కోసం వీడియోలు తీసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్‌ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడు. దాడి జరిగే సమయంలో ఓ చెట్టుపై దాక్కొని ముష్కరుల క్రూరత్వాన్ని మొత్తాన్ని చిత్రీకరించాడు. కాగా.. ఈ విషయాన్ని సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ‘‘ఈ ఫొటోగ్రాఫర్‌ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి.. తూటాలను తప్పించుకోవడానికి చెట్టు కొమ్మపై దాక్కొన్నాడు. ఆ తర్వాత మొత్తం చిత్రీకరించాడు’’ అని ఓ సీనియర్‌ అధికారి వెల్లడించాడు. కాగా.. ఫొటోగ్రాఫర్ తీసిన ఆ వీడియోల ఆధారంగా ఎన్ఐఏ ఈ దారుణాన్ని వరుస క్రమంలో తెలుసుకునేందుకు కీలకంగా మారింది. అంతేకాకుండా ఎన్ఐఏ అధికారుల బృందం వీడియోగ్రాఫర్ ను ప్రశ్నించి ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు, వారికి సహకరించిన ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ముష్కరులు రెండు గ్రూపులుగా..

అయితే, ఉగ్రదాడి జరిగిన రోజు.. ముష్కరులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. తొలుత ఇద్దరు ఉగ్రవాదులు సందర్శకులను ముస్లిం మతాచారాన్ని పాటించమని బెదిరించారు. ఆ తర్వాత దాదాపు నలుగురిని కాల్చి చంపారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. సందర్శకులు తలోదిక్కులకు పారిపోగా.. జిప్‌లైన్‌ అనే ప్రదేశం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు మొదలుపెట్టారు. అంతేకాకుండా, స్థానికుల నుంచి రెండు ఫోన్లు కూడా లాక్కొనట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిల్లో ఒకటి సందర్శకుడిది కాగా.. రెండోది స్థానికులది. ఇప్పుడు వాటిని ట్రాక్‌ చేసేందుకు యత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ముష్కరుల లొకేషన్లు ట్రేస్ చేసేందుకు యత్నిస్తున్నారు. అయితే, దాడి తర్వాత నుంచి అవి స్విచ్ఛాఫ్‌ అయినట్లు గుర్తించారు. ఇక స్పాట్ నుంచి ఏకే-47, ఎం4 రైఫిల్‌ బుల్లెట్ షెల్స్ ని అధికారులు గుర్తించారు.

Next Story