- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Supreme Court: శ్రీనగర్ కు చెందిన కుటుంబానికి మధ్యంతర రక్షణ కల్పించిన కోర్టు
శ్రీనగర్ కు చెందిన కుటుంబానికి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఓ కుటుంబానికి శుక్రవారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీనగర్ కు చెందిన కుటుంబానికి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. భారత్ నుంచి పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితిలో ఉన్న ఓ కుటుంబానికి శుక్రవారం సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం కారణంగా పాక్ జాతీయుల వీసాలు రద్దయ్యాయి. దీంతో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్ తారిక్ భట్ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కే సింగ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ అంశంలో తనిఖీ చేసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ పిటిషన్ ను దాఖలు చేయడంలోనే లోపాలున్నాయి. దీనిపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తంచేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నాం. కానీ, అధికారులకు ఓ సూచన చేస్తున్నాం. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. పిటిషనర్ చూపుతున్న పత్రాలను, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే అంశాలను తనిఖీ చేయండి. ఈ కేసులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్ముకశ్మీర్ హైకోర్టును ఆశ్రయించవచ్చు.’’ అని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి అసలైన వాస్తవాలను నిర్ధరించే అధికారం హైకోర్టుకు ఉందని పేర్కొంది.
వీసా గడువు ముగిసినా..
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీయులకు కేంద్రం వీసాలు రద్దు చేసింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్‌లో ఉండగా.. కుమారుడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆ ఫ్యామిలీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. తాము భారత జాతీయులమే అయినా మమ్మల్ని అరెస్టు చేశారని వారు వాదనలు వినిపించారు. తమవద్ద ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ అన్నీ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేశారని పిటిషనర్ న్యాయవాది నంద కిషోర్ కోర్టుకు వెల్లడించారు. కాగా.. వాదనలు విన్న కోర్టు..ఆ కుటుంబానికి రక్షణ కల్పించింది. ఇక కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. పిటిషనర్లు తగిన అధికార యంత్రాంగం వద్దకు వెళ్లడం సరైన చర్యగా అభివర్ణించారు.






