పెరల్‌ ఆగ్రో టెక్‌ కార్పొరేషన్‌ పేరుతో భారీ కుంభకోణం.. మాజీ డైరెక్టర్ అరెస్ట్

by Naga Rani Yarlagadda |

పెరల్‌ ఆగ్రో టెక్‌ కార్పొరేషన్‌ పేరుతో భారీ కుంభకోణం.. మాజీ డైరెక్టర్ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: పెరల్‌ ఆగ్రో టెక్‌ కార్పొరేషన్‌ (PACL) పేరుతో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులను మోసగించిన భారీ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక ముద్దాయిని ఉత్తరప్రదేశ్‌ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్‌ (EOW) పోలీసులు అరెస్టు చేశారు. కార్పొరేషన్ మాజీ డైరెక్టర్‌ గుర్నామ్‌ సింగ్‌ (69)ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో దాదాపు రూ.49 వేల కోట్ల మేర మోసం జరిగినట్టు తెలుస్తోంది.

మారిన పేరు, మారని నైజం

2011లో గుర్వంత్‌ ఆగ్రోటెక్‌ లిమిటెడ్‌ను PACLగా మార్చిన గుర్నామ్ సింగ్‌ (Gurnam Singh).. తదుపరి దశల్లో సంస్థ కార్యకలాపాలను పలు రాష్ట్రాలకు విస్తరించారు. ఆర్‌బీఐ (RBI) అనుమతి లేకుండా అధికారిక బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించి, ప్రజల నుంచి పెట్టుబడులు ఆకర్షించారు. ఆకర్షణీయమైన రాబడులు, భూముల పేరిట ఆశ చూపుతూ, రశీదులు, బాండ్లు ఇచ్చి పెద్ద ఎత్తున డిపాజిట్లు స్వీకరించారు. అయితే వాస్తవంగా ఆ డబ్బుకు ఎటూ గమ్యం లేకుండా పోయింది. భూములు ఇవ్వకపోవడం, డిపాజిట్లను తిరిగి చెల్లించకపోవడం వల్ల ఈ మోసం బయటపడింది.

10 రాష్ట్రాల్లో మోసాలు

ఈ కంపెనీ కార్యకలాపాలు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, అస్సాం, ఆంధ్రప్రదేశ్‌, దిల్లీ సహా పది రాష్ట్రాల్లో విస్తరించి ఉండటంతో పెద్దఎత్తున ప్రజలు మోసపోయారు. మొత్తం స్కాం విలువ రూ.49 వేల కోట్లకు చేరినట్లు అధికారులు తెలిపారు. గుర్నామ్‌ సింగ్‌పై 2012–2015 మధ్యకాలంలో ఢిల్లీలో కేసులు నమోదయ్యాయి. 2016లో సీబీఐ అతన్ని అరెస్టు చేసినప్పటికీ, ఆరు నెలలకే బెయిల్‌పై బయటికి వచ్చాడు. అప్పటి నుంచి తొమ్మిదేళ్లు లాంటి కాలం గుప్తంగా జీవించాడు. తాజాగా.. ఈ కేసును చూసే బాధ్యతను తీసుకున్న ఉత్తరప్రదేశ్‌ ఉత్తరప్రదేశ్‌ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్‌ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ మల్టీస్టేట్ స్కాం కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు జైల్లో ఉన్నారు. ఈ అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత వేగం కానుంది. PACL మోసం దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి మోసాల్లో ఒకటిగా చరిత్రలో నిలిచే అవకాశముంది.

Next Story