Maharashtra: ఆగష్టు 15 మాంసం నిషేధంపై మహాలో రాజకీయ దుమారం

by S Gopi |

కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మాంసాన్ని నిషేధించాలన్న నిర్ణయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమర్శించారు.

Maharashtra: ఆగష్టు 15 మాంసం నిషేధంపై మహాలో రాజకీయ దుమారం
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న వేళ మహారాష్ట్రలోని కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు తీసుకున్న ఓ నిర్ణయం తీవ్రమైన రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఆగస్టు 15వ తేదీన మాంసం దుకాణాలు, వధశాలలను మూసేయాలని కొన్ని నగర పాలక సంస్థలు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష నేతలతో పాటు మిత్రపక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని మండిపడుతున్నారు. రాష్ట్రంలోని కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ) సహా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాంసాన్ని నిషేధించాలన్న నిర్ణయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమర్శించారు. అలాంటి చర్యలు తప్పు అని అభిప్రాయపడ్డారు. ప్రధాన నగరాల్లో, వివిధ కులాలు, మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇది భావోద్వేగ సమస్య అయితే, ప్రజలు దాన్ని అంగీకరిస్తారు. కానీ, మహారాష్ట్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి రోజుల్లో ఇలాంటి ఆదేశాలను అమలు చేస్తే, అది కష్టమని పవార్ విలేకరులతో అన్నారు. సాధారణంగా ఆషాఢ ఏకాదశి, మహాశివరాత్రి, మహావీర్ జయంతి మొదలైన సందర్భాలలో ప్రజల విశ్వాసాలను, సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఇటువంటి ఆంక్షలు ఉంటాయని పవార్ వెల్లడించారు. దీనికి సంబంధించ్ శివసేన(యూబీటీ) నేత ఆదిత్య థాకరే సైతం తప్పుబట్టారు. ప్రజలు తినే ఆహారం విషయంలో నిషేధాలు విధించే అధికారం, హక్కు కమిషనర్‌కు ఉండదన్నారు. ప్రజలు ఆహారంపై కాకుండా రోడ్లు, గుంతలపై కమిషనర్ దృష్టి పెడితే బాగుంటుందన్నారు.

ఇదే అంశంపై స్పందించిన ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. ఈ ఉత్తర్వులు కొత్త కాదని, 1988 నుంచి అమలులో ఉందన్నారు. ఈ నిషేధంపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహా పలువురు నాయకుల విమర్శలకు సమాధానమిచ్చిన ఆయన, మీడియా ద్వారా దీని గురించి తాను తెలుసుకున్నానని, ప్రజలు ఏమి తినవచ్చో, ఏమి తినకూడదో చెప్పాలని ప్రభుత్వానికి ఆసక్తి లేదని ఫడ్నవీస్ అన్నారు. ముందుగా తెలుసుకోవాల్సింది, ఈ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఈ నిర్ణయం 1988 నుంచి అమలులో ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ తీర్మానం కూడా ఉంది. నగర పాలక సంస్థలు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాయని నేను అడిగాను. అప్పుడే వారు 1988 నాటి ప్రభుత్వ తీర్మాణాన్ని పంపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అలాంటి సర్క్యులర్లు జారీ చేస్తున్నారని కూడా చెప్పారని తెలిపారు. నిజానికి, ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు అదే నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి సంబంధించిన కాపీని కూడా నాకు పంపారని పేర్కొన్నారు.

Next Story