- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మ్యాచ్ రాజకీయం.. భారత్-పాక్ ఆసియా కప్ మ్యాచ్‌పై విపక్షాల విమర్శలు
భారత్, పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ దేశవ్యాప్తంగా రాజకీయాలకు కేంద్రంగా మారింది. ఈ మ్యాచ్‌పై విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్.. దేశరాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, ఫ్యాన్స్ డిమాండ్లు చేస్తున్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచేసుకుంటామన్న భారత్.. క్రికెట్ ఎందుకు ఆడుతోందని విపక్షాలు మండిపడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు కురిపించింది. ఆప్ ఢిల్లీ చీఫ్ సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ ఆడేందుకు అనుమతించడం ద్వారా పహెల్గాం బాధితులను కేంద్ర అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అసలు ఈ మ్యాచ్ నిర్వహించాల్సిన అవసరం ఏముంది? దేశమంతా ఈ మ్యాచ్ వద్దంటుంటే ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇది కూడా ట్రంప్ ఒత్తిడితోనేనా? ట్రంప్ ముందు ఇంకా ఎంత తలవంచుతారు? అని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ఆప్ కార్యకర్తలు మ్యాచ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. దిష్టిబొమ్మలకు పాకిస్తాన్ జెర్సీలు వేసి తగలబెట్టారు. మ్యాచ్ ఆడేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సిగ్గుపడాల్సిన నిర్ణయం
శివసేన (యూబీటీ), కాంగ్రెస్ నేతలు ఈ మ్యాచ్ ఆడాలనే నిర్ణయాన్ని సిగ్గుపడాల్సిన విషయంగా అభివర్ణించారు. శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే ఈ మ్యాచ్ ఆడటంలో నైతికతను ప్రశ్నించారు. ‘నీళ్లు, రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధాని అన్నారు. అలాంటప్పుడు రక్తం, క్రికెట్ ఎలా కలిసి ప్రవహిస్తాయి? యుద్దం, క్రికెట్ ఒకేసారి ఎలా జరుగుతాయి? దేశభక్తి పేరుతో వాళ్లు వ్యాపారం చేస్తున్నారు. ఇది కేవలం డబ్బు కోసమే’ అంటూ మండిపడ్డారు. ఈ మ్యాచ్‌కు వ్యతిరేకంగా తాము నిరసనలు చేపడతామని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ప్రకటించారు. ‘సింధూర్ రక్షా అభియాన్’ పేరుతో మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తారన్నారు. ఈ మ్యాచ్ దేశద్రోహమని, సిగ్గులేనితనం అని ఆయన మండిపడ్డారు.
బీజేపీ సమాధానం..
భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై వస్తున్న విమర్శలపై బీజేపీ ఎంపీ, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ‘ఏసీసీ, ఐసీసీ నిర్వహించే మల్టీనేషనల్ టోర్నీల్లో తప్పనిసరిగా ఆడాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడకపోతే ప్రత్యర్థికి పాయింట్లు వచ్చి, మనం టోర్నీ నుంచి నిష్క్రమిస్తాం. కానీ పాకిస్తాన్‌తో ఎలాంటి ద్వైపాక్షిక టోర్నీలు ఆడబోం. ఆ దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదం వల్ల మన దేశానికి నష్టం జరుగుతున్నంత కాలం వాళ్లతో మనం క్రికెట్ ఆడం’ అని చెప్పారు.






