Operation Sindoor: భారత్- పాక్ ఉద్రిక్తతలపై భారత రాయబారి జేపీ సింగ్ కామెంట్స్

by Shamantha N |

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)ను చేపట్టింది. అయితే, ఈ దాడి తర్వాత పాక్ ఉగ్రకుట్రలపై ప్రపంచానికి తెలిపేందుకు భారత్ అఖిలపక్ష ప్రతినిధి బృందాలను విదేశాలుక పంపుతోంది.

Operation Sindoor: భారత్- పాక్ ఉద్రిక్తతలపై  భారత రాయబారి జేపీ సింగ్ కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)ను చేపట్టింది. అయితే, ఈ దాడి తర్వాత పాక్ ఉగ్రకుట్రలపై ప్రపంచానికి తెలిపేందుకు భారత్ అఖిలపక్ష ప్రతినిధి బృందాలను విదేశాలుక పంపుతోంది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి (Indian Envoy) జేపీ సింగ్ (JP Singh) ప్రపంచ దేశాలకు కీలక సూచన చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకంకావాలని పిలుపునిచ్చారు. పాక్‌పై భారత్‌ చేపట్టిన దాడులకు దారితీసిన సంఘటనలను ఇజ్రాయెల్‌ టీవీ ఛానెల్‌ i24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేపీ సింగ్‌ వివరించారు. అమెరికా తరహాలోనే పాక్‌ కూడా ఉగ్రవాదులను (terrorists) భారత్‌కు అప్పగించాలని ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ‘పహెల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రజలను చంపారు. దీనికి ప్రతిగా భారత్‌ (India) ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రస్థావరాలను మట్టుబెట్టింది. అయితే, పాక్ మాత్రం భారత సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులకు యత్నించింది. అందుకే భారత్ గట్టిగా బదులివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రస్తుతం కాస్త విరామం ఇచ్చాం అంతే. అది ముగిసిపోలేదు. ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది. అలాంటివారు ఎక్కడున్నా వారిని అంతం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాం’ అని తెలిపారు.

తహవూర్ హుస్సేన్ రాణా అప్పగింతపై..

ఇక 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana)ను అమెరికా ఇటీవలే భారత్‌కు అప్పగించింది. అయితే, అమెరికా తరహాలోనే పాక్‌ సైతం ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. హఫీజ్‌ సయీద్‌, సాజిద్‌ మీర్‌, జకీర్‌ రెహ్మాన్‌ లఖ్వీల వంటి ఉగ్రవాదులను న్యూఢిల్లీకి అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న దేశాలు దానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మే 10న నూర్ ఖాన్ స్థావరంపై భారత్ జరిపిన దాడిని ‘గేమ్ ఛేంజర్’గా పేర్కొన్నారు. ఆ ఘటన వల్ల పాక్ లో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయన్నారు. అందుకే కాల్పుల విరమణ కోసం పాక్ అధికారులు భారత ప్రతినిధులను సంప్రదించినట్లు తెలిపారు.

Next Story