- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక్క ఫోన్ కాల్.. యువ ప్రధానిపై సస్పెన్షన్ వేటు
థాయ్‌లాండ్ యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాపై అక్కడి అత్యున్నత న్యాయస్థానం సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

దిశ, వెబ్ డెస్క్: థాయ్‌లాండ్ (Thailand) యువ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రాపై (Phatthongthaeng Shinawatra) అక్కడి అత్యున్నత న్యాయస్థానం సస్పెన్షన్ వేటు వేయడంతో ఆ దేశ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పొరుగుదేశం కంబోడియా (Cambodia) నేతతో ఆమె చేసిన ఫోన్‌కాల్ లీక్ కావడం ఈ పరిణామానికి కారణమైంది. అందులో ఆమె దేశ భద్రత, సైన్యం వంటి కీలక విషయాలు చర్చించిందంటూ విమర్శలు వెల్లువెత్తడంతో, ఇది రాజ్యాంగ ఉల్లంఘనగా పరిగణిస్తూ కోర్టు తాత్కాలిక సస్పెన్షన్‌కు ఆదేశించింది. తుది తీర్పు వచ్చే వరకు ఆమె అధికారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆ తీర్పు ఆమెకు వ్యతిరేకంగా ఉంటే పేటోంగ్టార్న్ ప్రధాని పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది.
అసలేం జరిగిందంటే?
థాయిలాండ్-కంబోడియాల మధ్య కొంతకాలంగా సరిహద్దు వివాదం నెలకొంది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్ (Hun Sen)తో షినవత్రా ఫోన్‌కాల్ సంభాషణ లీకైంది. అందులో ఆమె హున్‌సేన్‌ను అంకుల్ అంటూ ఆయనను సంబోధించిన ఆమె.. తన దేశంలోని పరిస్థితులను వివరించారు. ఈ సందర్భంగా థాయ్ ఆర్మీ కమాండర్ తనకు వ్యతిరేకంగా ఉన్నాడని పేర్కొనటం తీవ్ర వివాదాస్పదమైంది.
ప్రధాని ఫోన్‌తో తమ దేశ పరువు, ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ షినవత్రా సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్జర్వేటివ్ భూమ్‌జాయ్‌థాయ్ పార్టీ విడిపోయింది. అలాగే, ఈ ఘటనపై కొందరు కన్సర్వేటివ్ సెనేటర్ల బృందం రాజ్యాంగ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దేశంలోని రాజ్యాంగ నిబంధనలను పేటోంగ్టార్న్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఇటీవల ఆమెపై కేసు దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన ఆ దేశ న్యాయస్థానం ప్రధానిపై సస్పెన్షన్ వేటు వేసింది.
కాగా, కంబోడియా మాజీ ప్రధాని హున్‌సేన్ 2023 వరకు అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత పదవి నుంచి దిగిపోగా.. ఆయన కుమారుడు హున్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు. అయితే, పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్‌సేన్. ఇక థాయ్‌లాండ్ బిలియనీర్, మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా కుమార్తె అయిన షినవత్రా.. గతేడాది ఆగస్టులో ప్రధాని పదవి చేపట్టారు. థాయ్‌లాండ్ చరిత్రలోనే 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్టించి అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు.






