- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Oman: ఆదాయ పన్ను విధించనున్న ఒమన్
ఏడాదికి 42,000 రియాల్స్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై 5 శాతం మేర పన్ను విధించే అవకాశం ఉంది.

దిశ, నేషనల్ బ్యూరో: ముడి చమురు ప్రధాన ఆదాయంగా ఉన్న గల్ఫ్ దేశాల్లో ఇప్పటివరకు ఆదాయ పన్ను లేదు. అంతర్జాతీయంగా ఇంధనానికి ఉన్న డిమాండ్ కారణంగా ఆయా దేశాలు ప్రత్యామ్నాయ ఆదాయం వైపు ఏనాడు ఆలోచించలేదు. అయితే, గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారుతూ వచ్చాయి. ముఖ్యంగా ఇంధన గిరాకీ నెమ్మదించడం, ఈ ఏడాది ఆరింటిలో కీలకమైన సౌదీ, బహ్రెయిన్ లాంటి దేశాలు ద్రవ్యలోటు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయనే సంకేతాల నేపథ్యంలో గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ ఆదాయాలను సిద్ధం చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒమన్ ఆర్థికవ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దానికోసం ఆదాయపు పన్ను విధించాలని భావిస్తోంది. 2028 నుంచి అమల్లోకి వస్తుందని అంచనా వేస్తున్న దీని ప్రకారం, ఏడాదికి 42,000 రియాల్స్ కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారిపై 5 శాతం మేర పన్ను విధించే అవకాశం ఉంది. తద్వారా పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 1 శాతం ఉండొచ్చని అంచనా. ఇదే గనుక అమల్లోకి వస్తే గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల్లో ఆదాయపు పన్ను విధించే తొలి దేశంగా ఒమన్ అవుతుంది.
దీనికి సంబంధించి ఒమన్ ఆర్థిక మంత్రి సయీద్ బిన్ మహ్మద్ అల్ సఖ్రి మాట్లాడుతూ.. దేశంలో సామాజిక వ్యయాలను కొనసాగిస్తూనే, ప్రభుత్వం ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. చమురు ఎగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, ప్రజలపై ఆదాయపు పన్ను విధించాలని నిర్ణయించామన్నారు. దీని ద్వారా దేశంలో అత్యధికంగా సంపాదించే వారిలో 1 శాతం మందిని పన్ను పరిధిలోకి తీసుకొస్తారని స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు ఒమన్ తీసుకున్న నిర్ణయంతో జీసీసీలో ఉన్న ఇతర దేశాలకు ఇది ఆదర్శం కావొచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల అంతర్జాతీయంగా సాంప్రదాయ ఇంధనాలకు గిరాకీ తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో ఆదాయపు పన్ను లాంటి సంస్కరణలు అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ఐఎంఎఫ్ కూడా సూచించింది.






