రేపు దేశ వ్యాప్తంగా సమ్మె.. యూజర్లకు ప్రయాణ కష్టాలు

by Naga Rani Yarlagadda |

దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు రేపు (ఫిబ్రవరి 7) జాతీయ స్థాయి సమ్మెకు పిలుపునిచ్చారు.

రేపు దేశ వ్యాప్తంగా సమ్మె.. యూజర్లకు ప్రయాణ కష్టాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు రేపు (ఫిబ్రవరి 7) జాతీయ స్థాయి సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె కారణంగా పలు నగరాల్లో రోజువారీ రవాణా సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ గిగ్ వర్కర్ల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ నిరసనతో క్యాబ్, ఆటో, బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయే పరిస్థితి నెలకొననుంది. “All India Breakdown” పేరుతో నిర్వహిస్తున్న ఈ నిరసనలో భాగంగా డ్రైవర్లు రైడ్ రిక్వెస్టులను క్యాన్సిల్ చేయడం లేదా యాప్‌లను పూర్తిగా ఆఫ్ చేయాలని నిర్ణయించారు.

సమ్మెకు పిలుపునిచ్చింది ఎవరు?

ఈ సమ్మెకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (TGPWU) ప్రధానంగా పిలుపునిచ్చింది. పలు జాతీయ కార్మిక సంఘాల సహకారంతో ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 7న జరగనున్న ఈ నిరసనలో దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత డ్రైవర్లు పాల్గొంటారని TGPWU సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రకటించింది. కనీస ఛార్జీలు లేకపోవడం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, కార్మికుల దోపిడీ కొనసాగుతుండటమే సమ్మెకు ప్రధాన కారణాలని యూనియన్ పేర్కొంది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పంపిన లేఖలో డ్రైవర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను యూనియన్ వివరించింది.

ఓలా, ఉబర్, రాపిడో, పోర్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు సంబంధించి ప్రభుత్వ నియంత్రిత ఛార్జీ విధానం లేకపోవడం వల్ల కంపెనీలే ఇష్టారాజ్యంగా చార్జీలను నిర్ణయిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది. దీని వల్ల డ్రైవర్ల ఆదాయం స్థిరంగా లేకపోవడం, దోపిడీకి గురికావడం, జీవనోపాధి అస్థిరంగా మారడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నప్పటికీ, లక్షలాది మంది డ్రైవర్లు పేదరికంలోనే ఉంటున్నారని యూనియన్ విమర్శించింది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, తమ డిమాండ్లను తీర్చాలని డిమాండ్ చేసింది.

భారత్ ట్యాక్సీ ప్రారంభంతో ఈ సమ్మెకు సంబంధముందా?

ఢిల్లీలో ఇటీవల ప్రారంభమైన భారత్ ట్యాక్సీ సేవలతో ఈ సమ్మెకు ప్రత్యక్ష సంబంధం లేదని యూనియన్లు స్పష్టం చేశాయి. ఇది పూర్తిగా ప్రస్తుత యాప్ ప్లాట్‌ఫారమ్‌లపై డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో చేపట్టిన నిరసన మాత్రమేనని తెలిపారు. ఓలా, ఉబర్‌లలో డ్రైవర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తుండగా, భారత్ ట్యాక్సీలో మాత్రం డ్రైవర్లు సహకార సంఘ సభ్యులుగా, భాగస్వాములుగా ఉంటారు. సారథులుగా పిలవబడే ఈ డ్రైవర్లు షేర్లు కలిగి ఉండి, నాయకత్వాన్ని ఎన్నుకునే హక్కు కూడా పొందుతారు. ఇతర యాప్‌లు 15 నుంచి 20 శాతం వరకు కమిషన్ తీసుకుంటుండగా, భారత్ ట్యాక్సీలో డ్రైవర్లకు ప్రయాణికులు చెల్లించిన మొత్తం.. వారికే అందుతుందని నిర్వాహకులు తెలిపారు.

Next Story