- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగాల్ ఓటర్ల జాబితాలో సిత్రాలు.. మాజీ ఎన్నికల అధికారి పేరు మాయం!
పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 12 సార్లు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పనిచేసిన వ్యక్తితో పాటు వందలాది మంది ఓటు హక్కు కోల్పోయారు.

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పెను సంచలనంగా మారింది. దశాబ్దాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు, ఏకంగా ఎన్నికలను నిర్వహించిన అధికారుల పేర్లే ఓటర్ల జాబితా నుండి తొలగించబడటం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. హుగ్లీ జిల్లాకు చెందిన 72 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎస్.అష్రఫుల్ హక్ (S. Ashraful Haque) గతంలో 12 ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అయితే, ప్రస్తుతం ఆయన పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. 1944 నాటి భూమి పత్రాలు, ఆధార్, పాన్ కార్డులు సమర్పించినప్పటికీ ఆయన పేరును డిలీషన్ లిస్టులో చేర్చారు. అదేవిధంగా 1947 నుంచి దేశంలోని అన్ని ఎన్నికల్లో ఓటు వేసిన సుబర్ణ బాల పొద్దార్ (97) అనే శరణార్థి పేరు కూడా జాబితాలో లేదు. 2002 రికార్డుల్లో పేరు స్పెల్లింగ్ స్వల్పంగా మారడమే దీనికి కారణమని తెలుస్తోంది.
ఇక నదియా జిల్లాలో ఓటర్ల జాబితాలో తన పేరు, కూతురి పేరు తొలగించడంపై అప్పీల్ చేయడానికి ఎస్డీవో (SDO) కార్యాలయం వద్ద క్యూలో నిల్చున్న జీవన్‌కృష్ణ బిశ్వాస్ (68) అనే వృద్ధుడు తీవ్ర ఒత్తిడికి లోనై కుప్పకూలి అక్కడికక్కడే మరణించారు. అయితే, ‘స్టేట్ ఐడెంటిఫికేషన్ రికార్డ్’ (SIR) వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఈ తొలగింపులు జరుగుతున్నాయి. సరైన పత్రాలు సమర్పించినా అధికారులు తిరస్కరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై బెంగాల్‌లో రాజకీయ దుమారం రేగుతోంది. వేలాది మంది అసలైన పౌరుల పేర్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా వారిని ఎన్నికలకు దూరం చేస్తున్నారని పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.






