- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుస్తక ప్రస్తావనపై అభ్యంతరం.. చైనా సరిహద్దులో కిరణ్‌రిజిజు
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు భారత్-చైనా సరిహద్దులోని బుమ్లా పాస్ ప్రాంతాన్ని సందర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం భారత్-చైనా సరిహద్దులోని బుమ్లా పాస్ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన సరిహద్దు భద్రతను పర్యవేక్షించడంతో పాటు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశాలను రాజకీయం చేయవద్దని ఆయన హితవు పలికారు.
సరిహద్దు అంశాలపై అవగాహన పెంచుకోవాలి
గల్వాన్ లోయ ఘర్షణలపై రాహుల్ గాంధీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలను రిజిజు తప్పుబట్టారు. ‘రాహుల్ గాంధీకి సరిహద్దుల గురించి ఏమీ తెలియదు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసే ముందు ఆయన చదువుకుని, సరిహద్దు అంశాలపై అవగాహన పెంచుకోవాలి’ అని మంత్రి ఎద్దేవా చేశారు.
ఆ పుస్తకం ప్రస్తావనపై అభ్యంతరం..
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె రాసినట్లుగా చెబుతున్న (ఇంకా ప్రచురితం కాని) ఆత్మకథలోని అంశాలను రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రస్తావించడంపై మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచురణ కానీ పుస్తకం గురించి చర్చించడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారంటూ రాహుల్ చేసిన ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తొలగించేందుకు ప్రతిపక్షాలు ఇచ్చిన అభిశంసన నోటీసుపై స్పందిస్తూ, దానివల్ల ఏమీ జరగదని రిజిజు ధీమా వ్యక్తం చేశారు. ‘రాహుల్ గాంధీ వద్ద తగినంత సంఖ్యా బలం లేదు. కేవలం వివాదం సృష్టించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, పార్లమెంట్ లో ఇవి చెల్లవు’ అని ఆయన తేల్చి చెప్పారు. ప్రతిపక్షాల నిరసనల వల్ల పార్లమెంటు పనివేళలు తగ్గినప్పటికీ, శాసనపరమైన పనులు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.






