- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్! ఏఐడీఎంకే సంచలన ఎన్నికల హామీలు ప్రకటన..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఏఐడీఎంకే ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఇవాళ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతిని పురస్కరించుకుని, పార్టీ ప్రధాన కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం పళనిస్వామి ఐదు కీలక హామీలను ప్రకటించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి (AIADMK) ఏఐడీఎంకే ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. ఇవాళ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ 109వ జయంతిని పురస్కరించుకుని, పార్టీ ప్రధాన కార్యాలయంలో నివాళులర్పించిన అనంతరం పళనిస్వామి ఐదు కీలక హామీలను ప్రకటించారు. మేనిఫెస్టో కమిటీ పర్యటనలు పూర్తికాకముందే ప్రజల్లోకి వెళ్లేందుకు కీలక నిర్ణయాలు వెల్లడించారు.
పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం
ప్రస్తుతం మహిళలకు అందుతున్న ఉచిత సిటీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పురుషులకు కూడా వర్తింపజేస్తామని ప్రకటించారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి పురుషులపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే 'మగళీర్ కులవిళక్కు' పథకం కింద ప్రతి కుటుంబంలోని మహిళా యజమానికి నెలకు రూ. 2,000 నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని వారికి ప్రభుత్వమే స్థలం ఇచ్చి కాంక్రీట్ ఇళ్లు, పట్టణాల్లో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు నిర్మించి నిరుపేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఎస్సీ సామాజిక వర్గాల్లో కొత్తగా పెళ్లైన జంటలకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు.
అమ్మ టూ వీలర్ స్కీమ్
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు 100 రోజుల ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులకు పెంచుతామని హామీ ఇచ్చారు. అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మంది మహిళలకు ద్విచక్ర వాహనాల కొనుగోలుపై రూ. 25,000 సబ్సిడీ అందిస్తామని వెల్లడించారు.
మా పథకాన్ని డీఎంకే కాపీ కొట్టింది
రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉండగా ఇన్ని ఉచిత పథకాలు ఎలా సాధ్యమని మీడియా ప్రశ్నించగా.. పళనిస్వామి అందుకు ధీటుగా స్పందించారు. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వానికి పరిపాలనా దక్షత లేదని. తాము అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా నడిపినట్లు తెలిపారు. సరైన ప్రణాళిక, పరిపాలనా సామర్థ్యం ఉంటే ఇవన్నీ సాధ్యమేనని అని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము రూ. 1,500 ఇస్తామని చెబితే, డీఎంకే దాన్ని కాపీ కొట్టిందని, కానీ ఇప్పుడు తాము మరింత మెరుగైన పథకాలతో ప్రజల ముందుకు వస్తున్నామని పళనిస్వామి తెలిపారు. మేనిఫెస్టో కమిటీ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని భారీ పథకాలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.






