‘సిలికాన్ వ్యాలీ’ కాదు.. అయ్యయ్యో ‘సిల్లీ వ్యాలీ’!

by Kema Shiva Kumar |

అనాది కాలం నుంచి సృష్టికి, జీవనానికి ఆధారం స్త్రీ. అమ్మగా, భార్యగా, సోదరిగా, స్నేహితురాలిగా, మార్గదర్శిగా స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనది.

‘సిలికాన్ వ్యాలీ’ కాదు.. అయ్యయ్యో ‘సిల్లీ వ్యాలీ’!
X

దిశ, వెబ్‌డెస్క్: అనాది కాలం నుంచి సృష్టికి, జీవనానికి ఆధారం స్త్రీ. అమ్మగా, భార్యగా, సోదరిగా, స్నేహితురాలిగా, మార్గదర్శిగా స్త్రీ పాత్ర ఎంతో కీలకమైనది. కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా, విద్య, ఆర్థిక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించి, సమాజంలో సమాన అవకాశాలను పొందుతూ, దేశ పురోగమనంలో తనదైన ముద్ర వేసే అచంచల శక్తి స్త్రీ. అంతటి మహోన్నత ఔన్నత్యం కలిగిన అబల అడ్డదారులు తొక్కుతోంది. కార్పొరేట్ లైఫ్‌కు అలవాటుపడి అడ్డదారులు తొక్కుతూ.. మద్యంలో మునిగి చిత్తువుతోంది. తాజాగా, సిలికాన్ వ్యాలీగా పిలువబడే బెంగళూరులో న్యూ ఇయర్ సందర్భంగా కార్పొరేట్ మహిళలు చేసిన అల్లరి దేశం పరువు, ప్రతిష్టలను బజారుకు తీసుకొచ్చేలా ఉన్నాయి. ఆ దృశ్యాలు చూసిన బెంగళూరు ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మరోవైపు మహిళలు తాగి తందనాలాడిన ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో కొందరు మహిళలు విచ్చలవిడిగా మద్యం సేవించి, లేవలేని స్థితిలో వీధుల్లో ఎక్కడ పడితే అక్కడే పడిపోయారు. కొందరిని వారి బాయ్‌ఫ్రెండ్స్ పట్టుకుని అడుగులో అడుగు వేయిస్తూ ఇంటికి తీసుకెళ్లే దృశ్యాలు కనిపించాయి. మరికొందరు మీడియా ప్రశ్నలు వేస్తే బూతులు తిడుతూ రచ్చ చేశారు. పబ్‌లు సిగరెట్ వాసనతో నిండి, మొహాలు కనబడకుండా అసభ్యకర డ్యాన్సులతో దద్దరిల్లాయి.

‘మద్యం తాగకుండా సంతోషం శాపమా?’.. ఓ నెటిజన్ ఫైర్

న్యూ ఇయర్ రచ్చ ప్రస్తుతం బెంగళూరు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ‘X’ (ట్విట్టర్) వేదికగా ‘కర్నాటక పోర్ట్‌ఫోలియో’ పేరుతో ఓ నెటిజన్ మహిళల ప్రవర్తనపై మండిపడ్డాడు. మన బెంగళూరు మళ్లీ ఒకసారి ‘పబ్ సిటీ’ నుంచి ‘పడిపోయే సిటీ’గా మారిందని కామెంట్ చేశారు. న్యూ ఇయర్ సంబరాల పేరుతో యువత మద్యాన్ని ‘సంస్కృతి సారాయి’గా తాగి, వీధులను గందరగోళం చేశారని ఆరోపించారు. ‘మద్యం తాగకుండా సంతోషం శాపమా’ అని నమ్మిన ఈ మహానుభావులు, రోడ్లపై పడిపోయి, గొడవలు చేసి, తిట్లు తిట్టి, మహిళలను చెప్పరాని చోట్ల తాకుతూ బ్రేక్ డ్యాన్స్‌లు వేశారని విమర్శించారు. ఇది మన సంస్కృతి కాదు.. బాటిల్ తెరిచి బ్రెయిన్ మూసే సంస్కృతి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుల్‌గా తాగి రోడ్లు బ్లాక్ చేయడం, భయపెట్టడం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తే బెంగళూరు ‘సిలికాన్ వ్యాలీ’ కాదు.. ‘సిల్లీ కాన్ వ్యాలీ’ అనిపిస్తుందని సెటైర్ వేశారు.

నగరం పరువుపోతోంది..

కార్పొరేట్ కల్చర్‌తో బెంగళూరు ఇమేజ్ పాడవుతోందని సామాన్యులు మండిపడుతున్నారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవైన ఈ నగరం, న్యూ ఇయర్ పేరుతో బిగ్ మ్యూజిక్, మద్యం, పరవుపోయే అసభ్యకర వీడియోలకు కేంద్రంగా మారిందని విమర్శలు వస్తున్నాయి. పోలీసులు నిద్రాహారాలు మాని బెంగళూరు నగరాన్ని కాపాడుతున్నారని, కుటుంబాలను వదిలి 24 గంటలూ డ్యూటీలో ఉంటూ డ్రంక్ డ్రైవింగ్ చెక్ పాయింట్లు, డ్రోన్లు, ఫేషియల్ రికగ్నిషన్‌తో నిత్యం పహారా కాస్తున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు. దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకు శక్తిమంతులైన యువత ఇలా జోరుగా తాగుతుంటే, ఫుల్‌గా తాగిన వారిని సురక్షితంగా ఇంటి చేరవేసిన పోలీసులే నిజమైన హీరోలని సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు.

Next Story