Kolkata Doctor Murder Case: ఆర్జీ కర్‌ హత్యాచార ఘటన.. దోషికి జీవిత ఖైదు

by Shamantha N |

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్‌ వైద్యవిద్యార్థిని(Kolkata Doctor Murder Case) హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు పడింది.

Kolkata Doctor Murder Case: ఆర్జీ కర్‌ హత్యాచార ఘటన.. దోషికి జీవిత ఖైదు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్‌ వైద్యవిద్యార్థిని(Kolkata Doctor Murder Case) హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదు పడింది. "ఇది అరుదైన కేసు కాదని నేను భావిస్తున్నాను. అందుకే చనిపోయే వరకు జైలు శిక్ష విధిస్తున్నాను" అని న్యాయమూర్తి జస్టిస్ అనిర్బన్ దాస్ శిక్షను ప్రకటించారు. అంతేకాకుండా, సంజయ్ రూ.50 వేలు జరిమానా చెల్లించాలని వెల్లడించారు. బాధితురాలి తల్లిదండ్రులకు రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇకపోతే, జనవరి 18న సంజయ్ రాన్ ని దోషిగా తేల్చిన సీల్దా కోర్టు.. ప్రస్తుతం శిక్ష ఖరారు చేసింది.

సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ రాయ్

శిక్షను ఖరారు చేసే ముందు సీల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ దోషి సంజయ్ ను ఏదైనా మాట్లాడాలని ఉందా అని ప్రశ్నించారు. దీంతో, మరోసారి సంజయ్ తాను తప్పు చేయలేదని కోర్టు ఎదుట చెప్పుకొచ్చాడు. “ ఎలాంటి కారణం లేకుండానే నాపై కుట్ర జరిగింది. నేను ఎప్పుడూ రుద్రాక్ష గొలుసు ధరిస్తానని నేను మీకు ముందే చెప్పాను. నేను నేరం చేసి ఉంటే, అది ఘటనాస్థలిలో పడిపోయేది. దర్యాప్తులో నన్ను మాట్లాడించేందుకు అనుమతించలేదు. అధికారులు బలవంతంగా నాతో చాలా పత్రాలపై సంతాలు తీసుకున్నారు. నన్ను మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వలేదని మీకు గతంలోనూ చెప్పా. ఇప్పుడు మీరు చూశారు” అని చెప్పుకొచ్చారు. దోషి వాదనపై జడ్జి స్పందిస్తూ.. ‘‘నాతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజు సమయం ఇచ్చాను. మూడు గంటలు మీ మాటలు విన్నాను. నా ముందు అభియోగాలు, సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి. వాటిని పరిశీలించాను. వాటి ఆధారంగానే దోషిగా తేల్చారు. ఇప్పటికీ మీరు దోషి. శిక్ష ఏంటనే మాత్రమే తెలుసుకోవాలనుకుంటున్నా. మీ ఫ్యామిలీలో మీతో ఎవరైనా సన్నిహితంగా ఉంటారా..?’’ అని అడిగారు. తన కుటుంబసభ్యులెవరూ తన దగ్గరకు రాలేదని జడ్జికి సంజయ్ బదులిచ్చారు. వాదనల సందర్భంగా సీబీఐ తరఫు న్యాయవాది మాట్లాడుతూ..‘‘ఇది చాలా అరుదైన కేసు. చనిపోయిన విద్యార్థిని ఎంతో ప్రతిభావంతురాలు. ఈ ఘటన సమాజాన్ని ఎంతగానో కలచివేసింది. వైద్యులకే రక్షణ లేకపోతే.. ఇంకేం చేయాలి. దోషికి మరణశిక్ష మాత్రమే ఇలాంటి ఘటనలు జరగవని ప్రజల్లో విశ్వాసాన్ని చాటి చెప్పగలవు’’ అని వాదించారు. ఇకపోతే, నవంబర్‌ 12నుంచి ఈకేసుపై సీల్దా కోర్టులో విచారణ జరుగుతోంది. దాదాపు 50 మంది సాక్ష్యాలను పరిశీలించింది. జనవరి 9న తుది విచారణ పూర్తయింది. మరోవైపు, సీల్దా కోర్టు వెలుపల భారీగా భద్రత ఏర్పాటు చేశారు.

అసలేం జరిగిందంటే?

గతఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీ కర్‌ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్‌ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్‌ డాక్టర్ పై హత్యాచారం (Kolkata Doctor Murder Case) జరిగింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేశారు. నిందితుడు సంజయ్‌రాయ్‌కు పాలిగ్రాఫ్‌ టెస్ట్‌ నిర్వహించడం సహా ఆర్జీకార్‌ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ ఘోష్‌తో పాటు పలువుర్ని సీబీఐ ప్రశ్నించింది. ఇక ఈ కేసులో ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్‌ స్టేషన్‌ మాజీ ఆఫీసర్‌ ఇన్‌ ఛార్జి అభిజిత్‌ మండల్‌ను అరెస్టు చేసింది. సాక్ష్యాలు తారుమారుచేశారన్న ఆరోపణలపై వారు అరెస్టయ్యారు. ఆతర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. కాగా.. ఈ కేసుపై ప్రత్యేక కోర్టుకు సీబీఐ అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్‌ రాయ్‌ పేరును మాత్రమే ఛార్జిషీట్‌లో చేర్చింది. అయితే, గ్యాంగ్ రేప్ అనే అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Next Story