‘పదవులు కాదు.. మనసే ముఖ్యం’.. ఖర్గే షూస్ తన చేతులతో సరిచేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!

by Ramesh Naini |   (  Updated:2026-05-07 14:54:34  IST  )

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

‘పదవులు కాదు.. మనసే ముఖ్యం’.. ఖర్గే షూస్ తన చేతులతో సరిచేసిన రాహుల్ గాంధీ.. వీడియో వైరల్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తనకంటే పెద్దవారైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పట్ల రాహుల్ చూపిన గౌరవం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో రాహుల్ గాంధీ అత్యంత సాధారణమైన రబ్బర్ చెప్పులు ధరించి కనిపించారు. అదే సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓ గది నుంచి బయటకు వస్తూ తన షూస్ వేసుకునే క్రమంలో కాస్త ఇబ్బంది పడటం రాహుల్ గమనించారు. వెంటనే ఏ మాత్రం సంకోచించకుండా ముందుకు వెళ్లిన రాహుల్.. కిందకు వంగి ఖర్గే షూస్‌ను తన చేతులతో సరిచేసి ఆయనకు సహాయం చేశారు.

ప్రశంసిస్తున్న నెటిజన్లు..

ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘రాహుల్ గాంధీకి రాజకీయాల కంటే ఇతరులను గౌరవించడమే ఎక్కువ ముఖ్యం’ అంటూ నెటిజన్లు, కాంగ్రెస్ మద్దతుదారులు ఆయన ఆత్మీయతను, పెద్దల పట్ల ఉన్న మర్యాదను కొనియాడుతున్నారు. ‘పదవులు కాదు.. మనసే ముఖ్యం’ అంటూ పలువురు ప్రశంసించారు. గతంలో కూడా ‘ఇండియా’ కూటమి సభలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఖర్గేలకు రాహుల్ గాంధీ స్వయంగా గ్లాసులో నీళ్లు పోసి ఇచ్చిన వీడియో సైతం ఇలాగే వైరల్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు నెటిజన్‌లు గుర్తుచేసుకుంటున్నారు.

Next Story