‘చైనీస్ కాదు.. మేము ఇండియన్స్’ డెహ్రాడూన్‌లో జాత్యహంకార దాడి.. త్రిపుర విద్యార్థి మృతి

by Ramesh Naini |

ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన ఘోరమైన దాడిలో త్రిపురకు చెందిన 24 ఏళ్ల ఎంబీఏ (MBA) విద్యార్థి ఏంజెల్ చక్మా ప్రాణాలు కోల్పోయాడు.

‘చైనీస్ కాదు.. మేము ఇండియన్స్’ డెహ్రాడూన్‌లో జాత్యహంకార దాడి.. త్రిపుర విద్యార్థి మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో జరిగిన ఘోరమైన దాడిలో త్రిపురకు చెందిన 24 ఏళ్ల ఎంబీఏ (MBA) విద్యార్థి ఏంజెల్ చక్మా ప్రాణాలు కోల్పోయాడు. డిసెంబర్ 9వ తేదీన సెలాకుయ్ ప్రాంతంలోని ఒక హోటల్ వద్ద ఏంజెల్ చక్మా, అతని సోదరుడు మైఖేల్ చక్మాపై కొంతమంది స్థానిక యువకులు జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు (Racial Slurs) చేస్తూ గొడవకు దిగారు. వారు 'చైనీస్' అని దూషించగా, తాము భారతీయులమేనని ఏంజెల్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి, నిందితులు కత్తులు, ఇనుప కడాలతో ఏంజెల్ తల, వీపుపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన ఏంజెల్ ప్రైవేట్ ఆస్పత్రిలో దాదాపు 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడి, డిసెంబర్ 25న మృతి చెందాడు.

పోలీసుల చర్యలు, భద్రత:

ఈ ఘటనపై డెహ్రాడూన్ పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో అవినాష్ నేగి, సూరజ్ ఖవాస్, సుమిత్‌తో పాటు ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధాన నిందితుడైన నేపాల్‌కు చెందిన యజ్ఞ అవస్థి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు ముమ్మరం చేస్తూ రూ. 25,000 రివార్డును ప్రకటించారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, ఉత్తరాఖండ్ సీఎంతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. డెహ్రాడూన్‌లో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థుల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి తగిన చర్యలు చేపట్టారు.

Next Story