ఉత్తర కొరియా వరుస మిసైల్ ప్రయోగాలు.. జపాన్, దక్షిణ కొరియా హై అలర్ట్

by Malleboina Mahesh |

ఉత్తర కొరియా వరుస బాలిస్టిక్ మిసైల్ ప్రయోగాలతో జపాన్, దక్షిణ కొరియా హై అలర్ట్ ప్రకటించాయి. ప్రధాని తకైచి సంక్షోభ నిర్వహణ బృందాన్ని రంగంలోకి దించారు.

ఉత్తర కొరియా వరుస మిసైల్ ప్రయోగాలు.. జపాన్, దక్షిణ కొరియా హై అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ఎంతో సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రపంచానికి మరో షాక్ తగిలేలా ఉంది. ఆదివారం (ఏప్రిల్ 19, 2026) తెల్లవారుజామున సుమారు 6 గంటల ప్రాంతంలో ఉత్తర కొరియా తూర్పు తీర నగరం సిన్పో (Sinpo) నుంచి వరుసగా బాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించడంతో కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ ప్రయోగాలను గుర్తించిన జపాన్, దక్షిణ కొరియా ప్రభుత్వాలు తమ రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేశాయి.

జపాన్ ప్రధాన మంత్రి సనా తకైచి (Sanae Takaichi) దీనిపై స్పందిస్తూ, ప్రభుత్వం అత్యున్నత స్థాయి సంక్షోభ నిర్వహణ ప్రోటోకాల్‌లను యాక్టివేట్ చేసిందని వెల్లడించారు. ఈ మిసైళ్లు జపాన్ యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) వెలుపల పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. విమానాలు, నౌకల భద్రతను నిర్ధారించాలని, ప్రజలకు ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు.

దక్షిణ కొరియా మిలిటరీ సైతం ఈ ప్రయోగాలను ధృవీకరిస్తూ, తమ నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తర కొరియా జరిపిన ఏడవ బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం ఇది కాగా, ఏప్రిల్ నెలలోనే ఇది నాలుగోసారి కావడం గమనార్హం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తూ కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం చేస్తున్న ఈ వరుస పరీక్షలపై అమెరికా, జపాన్, దక్షిణ కొరియా కలిసి సమాచారాన్ని విశ్లేషిస్తున్నాయి. మే నెలలో జరగనున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సదస్సుకు ముందే ఉత్తర కొరియా తన అణు సామర్థ్యాన్ని ప్రదర్శించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం ఈ పరిణామాలపై చర్చించేందుకు అత్యవసర భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Next Story