Noida Daycare Horror : నోటిలో పెన్సిల్ తోసి, తొడలపై కొరికి.. చిన్నారి పట్ల డేకేర్‌ సిబ్బంది దారుణం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-11 08:44:34  IST  )

నోయిడాలోని డే కేర్ సెంటర్ లో 15 నెలల చిన్నారిపట్ల ఆయా అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది.

Noida Daycare Horror : నోటిలో పెన్సిల్ తోసి, తొడలపై కొరికి.. చిన్నారి పట్ల డేకేర్‌ సిబ్బంది దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: నోయిడాలోని డే కేర్ సెంటర్ లో 15 నెలల చిన్నారిపట్ల ఆయా అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది. ఆకలివేస్తే నోరు తెరిచి అమ్మా ఆకలి అని అడగలేని పసి ప్రాణంపై అటెండర్ చేసిన దారుణ ఘటన గురించి తెలిస్తే.. ఎవరికైనా ఆమె అసలు మనిషేనా అనిపించక మానదు. నోయిడాలోని సెక్టార్ 137లోని ఒక డే కేర్ కేంద్రంలో జరిగింది ఈ అమానుష ఘటన. పరాస్ టిరియాలోని ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో బ్లిప్పి ప్రీ - స్కూల్ అండ్ డే కేర్ సెంటర్ ను రన్ చేస్తున్నారు. బాధిత చిన్నారి తండ్రి ఆగస్టు 4న ఉదయం 10.30 గంటల సమయంలో చిన్నారిని అక్కడ వదిలి వెళ్లాడు. మధ్యాహ్నానికి చిన్నారి తల్లి తీసుకెళ్లేందుకు వెళ్లగా.. అక్కడి సిబ్బంది పాప చాలాసేపటి నుంచి ఏడుస్తూనే ఉందని చెప్పారు.

ఇంటికి తీసుకెళ్లాక చిన్నారిని పరిశీలించగా తొడలపై కొరికిన మచ్చలు కనిపించాయి. అదేమిటని డే కేర్ సెంటర్ సిబ్బందిని ప్రశ్నించగా ఇన్ఫెక్షన్ వచ్చి ఉంటుందని నిర్లక్ష్యంగా బదులిచ్చారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా.. ఎవరో కొరికారని, అవి కొరికిన గాట్లేనని తేల్చారు. దాంతో తల్లిదండ్రులు సీసీటీవీ ఫుటేజ్ చూపించాలని అడగ్గా అవి పనిచేయడం లేదని బదులిచ్చారు. తరచూ తమ డే కేర్ సెంటర్ ను మార్చుతుండటంతో టెక్నికల్ ఇష్యూ వచ్చిందని బదులిచ్చారు. ఆగస్టు 5న చిన్నారి తల్లిదండ్రులు 112కి కాల్ చేయడంతో అక్కడికి పోలీసులు చేసుకున్నారు. ఆ డే కేర్ సెంటర్ కు లైసెన్స్ ఉందా అని చెక్ చేశారు. ఆగస్టు 7న సీసీటీవీ ఫుటేజీని చూడగా.. అందులో కేర్ టేకర్ గా ఉన్న యువతి చిన్నారిపై పిడిగుద్దులు గుద్దడం, నేలపై పడేసి, తోసి, ప్లాస్ బ్యాట్ తో కొట్టి, నోటిలో పెన్సిల్ పెట్టి మృగంలా ప్రవర్తించిన దృశ్యాలు కనిపించాయి.

చిన్నారి తల్లిదండ్రులు మోనికా, సందీప్ కుమార్ ల ఫిర్యాదు మేరకు.. పోలీసులు సదరు డే కేర్ యజమాని చారు, కేర్ టేకర్ పై బీఎన్ఎస్ సెక్షన్లు 115(2), 352, 351 ప్రకారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. తమ కూతురిని మే 21 నుంచి డే కేర్ సెంటర్ కు పంపుతున్నామని, అక్కడ చేర్చే ముందు 5 సీసీటీవీలు ఉన్నట్లు గమనించానని సందీప్ తెలిపాడు. ప్రతి బిడ్డను సురక్షితంగా చూసుకుంటామని హామీ ఇచ్చారని, ఇప్పుడు చూస్తే మైనర్ ను కేర్ టేకర్ గా చేర్చుకోవడమే కాకుండా, తమ బిడ్డ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Read More.. ప్రియుడితో పట్టుబడ్డ ప్రభుత్వాధికారి భార్య.. ఓయోలో బట్టలు లేని స్థితిలో.. ఛీ..ఛీ.. (VIDEO)

Next Story