- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుపాకీ పెట్టి డీల్స్ చేయలేరు.. భారత ప్రయోజనాలే ముఖ్యం: పీయూష్ గోయల్
భారత్ తలపై తుపాకీ పెట్టి ఎవరూ డీల్స్ చేసుకోలేరని, తమకు భారత ప్రయోజనాలే ముఖ్యమని పీయూష్ గోయల్ స్పష్టంచేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తొందరపడో, లేదంటే ఒత్తిడికి తలొగ్గడం వల్లనో భారత్ ఎలాంటి ఒప్పందాలూ చేసుకోదని ఆయన స్పష్టంచేశారు. జర్మనీలో బెర్లిన్ డైలాగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దేశ దీర్ఘకాల ప్రయోజనాలకు ఉపయోగపడేలా ఉండే ఒప్పందాలనే తాము చేసుకుంటామని ఆయన చెప్పారు. ‘మేం యూరోపియన్ యూనియన్‌తో చర్చలు జరుపుతున్నాం. అమెరికాతో కూడా చర్చలు సాగుతున్నాయి. మేం తొందరపడి ఎలాంటి డీల్స్ చేసుకోం. డెడ్‌లైన్స్ కోసమో, మా తలపై గన్ను పెట్టారనో మేం ఎలాంటి ఒప్పందాలు చేసుకోం’ అని ఆయన తేల్చిచెప్పారు. అంతర్జాతీయ భాగస్వాములతో చర్చలు కొనసాగుతున్నాయన్న ఆయన.. అందరితో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే దేశ ప్రాధాన్యతల విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వబోమని, కేవలం త్వరగా ముగించాలనే ఆలోచనతో ఒప్పందాలు చేసుకోదని స్పష్టంచేశారు.
భారత్‌పై అధిక సుంకాల భారాన్ని తగ్గించేందుకు కొత్త మార్కెట్లను అన్వేషిస్తున్నట్లు గోయల్ తెలిపారు. అదే సమయంలో దేశంలోని ఎగుమతిదారులకు మంచి వాణిజ్యం లభించేలా చూస్తామన్నారు. బాహ్య ఒత్తిడిలను తాము పట్టించుకోబోమని, స్వయం ప్రాధాన్యతలు, వ్యూహాలే తమకు ముఖ్యమని ఆయన చెప్పారు. భారత్ చేసుకునే భాగస్వామ్యాలన్నీ కూడా పరస్పర గౌరవంపై నిర్మితమైనవని, తాము ఎవరితో వ్యాపారం చేయాలనే విషయాన్ని ఎవరూ నిర్దేశించలేరని తేల్చిచెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయొద్దని భారత్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అదే సమయంలో యూఎస్‌తో వాణిజ్య చర్చలు కూడా అనుకున్నంత వేగంగా ముందుకుసాగని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యంపై గోయల్ ఇలా పరోక్షంగా చురకలేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.






