- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరియా కొరినా మచాడోను వరించిన నోబెల్ శాంతి బహుమతి.. బొక్కబోర్ల పడిన ట్రంప్
నోబెల్ శాంతి బహుమతిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది.

దిశ, వెబ్‌డెస్క్: నోబెల్ శాంతి బహుమతిపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. ఈ మేరకు వెనెజులా పార్లమెంట్ సభ్యురాలైన మరియా కొరినా మచాడో (Maria Corina Machado)ను నోబెల్ శాంతి బహుమతి వరించింది. ప్రస్తుతం ఆమె ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నది. నికోలస్ మదురో రెజీమ్‌కు వ్యతిరేకంగా తన భయంలేని పోరాటానికి, వెనిజువెలా ప్రజలకు ప్రజాస్వామ్య హక్కులు సాధించేందుకు చేసిన కృషికి ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ నోబెల్ శాంతి బహుమతి వెనిజువెలాను నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వైపు మళ్లించే క్రమంలో మరియా కొరినా మచాడో సాధించిన ఓ మైలురాయిగా చెప్పవచ్చు.
కాగా, 1967 అక్టోబర్ 7న కారకాస్‌లో జన్మించిన మరియా కొరినా మచాడో, ఇండస్ట్రియల్ ఇంజనీర్, ఫైనాన్షియల్ విశ్లేషకురాలిగా వృత్తిపరంగా కెరీర్‌ను మొదలుపెట్టారు. 2010లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికై రికార్డు ఓట్లతో గెలిచి, నికోలస్ మదురో రెజీమ్‌లోని అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక సంక్షోభాలను బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు. 2014లో నికోలస్ మదురో రెజీమ్ ఆమెను అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. 2012లో వెంటే వెనిజువెలా అనే సెంటర్ రైట్ పార్టీని స్థాపించి.. ఆ పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్నారు. 2017లో సాయ్ వెనిజువెలా అలయన్స్‌ను ఏర్పాటు చేసి విభిన్న ప్రజాస్వామ్యవాద శక్తులను అన్నిటినీ ఏకం చేశారు. 2023 అక్టోబర్‌లో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో 92 శాతం ఓట్లతో విజయం సాధించి 2024 అధ్యక్ష ఎన్నికలకు విపక్ష అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
అయితే, నికోలస్ మదురో రెజీమ్ ఆమె వ్యతిరేకులతో కలసి అన్యాయంగా ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించారు. దీంతో ఆమె ఎడ్ముండో గాంజాలెజ్ మద్దతుతో ఎన్నికల్లో పాల్గొని 70 శాతం ఓట్లతో విజయం సాధించారు. 2024 జూలై 28న జరిగిన అధ్యక్ష ఎన్నికల తర్వాత మదురో రెజీమ్ ఆమెది మోసపూరిత విజయమని ప్రకటించడంతో మరియా కొరినా మచాడో అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం కొనసాగించారు. 14 నెలలుగా ఎవరికీ కనపడకుండా తన కుమార్తె అనా కొరినా మాత్రమే పక్కన పెట్టుకుని మిగిలిన ఇద్దరు పిల్లలను విదేశాలకు పంపారు. మరియా కొరినా మచాడోకు ఈ ఏడాది సాఖారోవ్ బహుమతి (ఎడ్ముండో గాంజాలెజ్‌తో పాటు), వాక్లావ్ హావెల్ మానవ హక్కుల బహుమతి, జెనీవా సమ్మిట్ కరేజ్ అవార్డులు వరించాయి. ఈ సంవత్సరంలోనే టైమ్ మ్యాగజైన్ 100 మంది ప్రభావవంతుల బాబితాలో సైతం ఆమెను చేర్చింది. మరోవైపు ఇన్నాళ్లు తనకే నోబుల్ శాంతి బహుమతి వస్తుందని ప్రపంచ దేశాల ముందు జబ్బలు చరిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చివరగా భంగపాటు తప్పలేదు.






