9వ తరగతి నుండి త్రిభాషా సూత్రం వద్దు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

9వ తరగతి విద్యార్థులకు కొత్తగా మూడో భాషను (Third Language) ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

9వ తరగతి నుండి త్రిభాషా సూత్రం వద్దు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: సీబీఎస్‌ఈ (CBSE) కరికులమ్‌లో భాగంగా 9వ తరగతి విద్యార్థులకు కొత్తగా మూడో భాషను (Third Language) ప్రవేశపెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హైస్కూల్ స్థాయిలో, ముఖ్యంగా బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో విద్యార్థులపై ఇది అనవసరమైన విద్యా ఒత్తిడిని పెంచుతుందని అభిప్రాయపడింది. ఈ విధానాన్ని 9వ తరగతి నుండి కాకుండా ప్రాథమిక స్థాయిలోనే, అంటే 5 లేదా 6వ తరగతి నుండి అమలు చేస్తే విద్యార్థులు సులభంగా నేర్చుకోగలుగుతారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. "భారత ప్రభుత్వమా, దయచేసి 9వ తరగతి నుండి మూడో భాషను ప్రవేశ పెట్టవద్దు. ఎందుకంటే 8వ తరగతి ముగింపు నుండే విద్యార్థులపై బోర్డు పరీక్షల ఒత్తిడి మొదలవుతుంది. 9వ తరగతి అనేది విద్యార్థులకు అత్యంత మానసిక ఒత్తిడి తో కూడుకున్న సమయం. కొత్త భాషను నేర్పించాలనుకుంటే దానిని 5 లేదా 6వ తరగతిలోనే ప్రారంభించండి" అని జస్టిస్ నాగరత్న పేర్కొంటూ.. కోర్టు వ్యక్తపరిచిన ఈ అభిప్రాయాన్ని ప్రభుత్వానికి చేరవేయాలని కేంద్ర కౌన్సిల్‌కు సూచించారు. తమిళనాడులోని ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల (JNVs) ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

Next Story