Nuclear Facility: పాకిస్తాన్‌లో రేడియేషన్ లీక్‌ను ఖండించిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ

by S Gopi |

రేడియేషన్ లీక్ ఊహాగానాలపై ప్రపంచ అణు నిఘా సంస్థ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) స్పష్టత ఇచ్చింది.

Nuclear Facility: పాకిస్తాన్‌లో రేడియేషన్ లీక్‌ను ఖండించిన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో ఇటీవల సైనిక వివాదం తర్వాత పాకిస్తాన్‌లోని అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ ఊహాగానాలపై ప్రపంచ అణు నిఘా సంస్థ అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ) స్పష్టత ఇచ్చింది. పాక్‌లోని అణు స్థావరాల నుంచి ఎలాంటి రేడియేషన్ లీక్ అవ్వడంలేదని వెల్లడించింది. తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం అలాంటి ఘటన ఏదీ జరగలేదని తెలిపింది. పెహల్గాం ఉగ్రవాద దాడికి భారత ప్రభుత్వం అంతకుమించిన స్థాయిలో బదులిచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, దీని తర్వాత పాకిస్తాన్ సైన్యం భారత్‌పై దాడికి దిగడంతో భారత ప్రభుత్వం ప్రతికార దాడులు నిర్వహించింది. ఈ సమయంలోనే పాకిస్తాన్‌లో ఉన్న అణు ఇంధన కేంద్రాలను భారత్ టార్గెట్ చేసిందనే వార్తలు వచ్చాయి. అయితే, భారత సైన్యం ఖచ్చితమైన, పాక్ ఎయిర్‌ఫోర్స్ స్థావరాలపైనే దాడి చేసినట్టు స్పష్టత ఇచ్చింది. కానీ ఈ దాడుల్లో పాక్‌లోని కిరానా హిల్స్‌లో ఉన్న న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ స్థావరం కొంత ప్రభావితమైనట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ కారణంగానే పాకిస్తాన్ అప్పటికప్పుడు అమెరికాను బతిమాలి భారత్ దాడులను ఆపేందుకు ఒప్పించినట్టు తెలుస్తోంది.

కిరానా హిల్స్ రహస్యమేంటి..

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న సర్గోధ సమీపంలో ఉన్న కిరానా హిల్స్ చాలా కాలంగా పాకిస్తాన్ అణు లక్ష్యాలతో ముడిపడి ఉంది. దీన్ని పాకిస్తాన్ అత్యంత రహస్య సైనిక జోన్‌గా పరిగణిస్తారు. 1980ల నుంచి, పాకిస్తాన్ ప్రాంతీయ భద్రత కోసం అణు సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటోందని పలు నివేదికలు చెబుతున్నాయి.

1983 నుంచి 1990 వరకు, పాకిస్తాన్ అణు ఇంధన కమిషన్ (పీఏఈసీ) సబ్‌క్రిటికల్ అణు పరీక్షలను నిర్వహించడానికి కిరానా హిల్స్‌ను ఉపయోగిస్తున్నట్టు సమాచారం. వీటిని అంతర్జాతీయ నిఘా గుర్తించకుండా ఉండటానికి గోప్యంగా ఉంచారు. ఎక్కువ స్థలం అవసరం లేకుండా పాకిస్తాన్ తన అణు నమూనాలను మెరుగుపరచడానికి ఈ పరీక్షలు చాలా కీలకం.

Next Story