- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi: ఢిల్లీలో అన్ని రాష్ట్రాల పాత వాహనాలకు నో-ఫ్యుయెల్
దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఏక్యూఎం స్పష్టం చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: కాలుష్య నియంత్రణలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం చెల్లిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల కంటే ఎక్కువ కాలం చెల్లిన పెట్రోల్ వాహనాలు ఢిల్లీలోని ఏ బంకులోనైనా ఇంధనం నింపుకోవడానికి అనుమతి ఉండదు. ఆయా వాహనాలు దేశంలోని ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన సరే ఇంధన నింపుకునేందుకు వీలుండదు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) శుక్రవారం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గతంలోనే జూలై 1 నుంచి కాలం చెల్లించ అన్ని వాహనాలకు ఇంధనం అమ్మడం ఆపాలని సీఏక్యూఎం ఇంధన స్టేషన్లకు సూచించింది. తాజాగా ఈ నియమాన్ని ఢిల్లీలో నమోదైన వాహనాలకే కాకుండా అన్ని కాలం చెల్లిన వాహనాలకూ వర్తిస్తాయని తెలిపింది. ఢిల్లీలో రిజిస్టర్ అయిన వాహనాలపై ఉన్న ఆంక్షలను తప్పించుకునేందుకు ప్రజలు తరచుగా ఢిల్లీ వెలుపల తమ వాహనాలను రిజిస్టర్ చేసుకుంటున్నారు. దాన్ని నివారించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్టు సీఏక్యూఎం ప్రతినిధి వీరేంద్ర శర్మ అన్నారు. వాహనాలను తనిఖీ చేసేందుకు ఢిల్లీలో ఉన్న 520 ఇంధన స్టేషన్లలో 500 ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) కెమెరాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మిగిలినవి జూన్ 30 నాటికి ఏర్పాటవుతాయి. ఈ కెమెరాలు వాహన్ డేటాబేస్ ద్వారా ఆయా వాహనాల వయస్సును తనిఖీ చేయడానికి వాహన నంబర్ ప్లేట్‌లను స్కాన్ చేస్తాయి. వాహనం చాలా పాతదైతే, కంట్రోల్ రూమ్‌కు, ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లకు వార్నింగ్ పంపిస్తాయి.
పాత వాహనంగా గుర్తిస్తే
కెమెరాలు స్కాన్ చేసినప్పుడు పాత వాహంగా గుర్తిస్తే, రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ (ఆర్‌వీఎస్ఎఫ్) నిబంధనల ప్రకారం వాహనాన్ని స్వాధీనం చేసుకోవచ్చు లేదా స్క్రాపింగ్ కోసం పంపవచ్చు. పెట్రోల్ బంకులు అలాంటి వాహనాలకు ఇంధనాన్ని నింపకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే ఏ స్టేషన్ అయినా చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటుందని అధికారులు హెచ్చరించారు. దీన్ని అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు, రవాణా అధికారులతో కూడిన 100 టీమ్‌లను నియమించారు. ఈ కఠిన నిర్ణయం ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో పాత వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి తీసుకున్న అతిపెద్ద చర్యలలో ఒకటి.






