‘ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడొద్దు’.. కీలక రంగాలపై ప్రధాని మోడీ స్పెషల్ ఫోకస్!

by Kema Shiva Kumar |

ఐదు దేశాల పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చిన ప్రధాన మోడీ కేంద్ర మంత్రి మండలితో 5 గంటల పాటు సుదీర్ఘ భేటీ అయ్యారు.

‘ప్రజలపై ఆర్థిక ఒత్తిడి పడొద్దు’.. కీలక రంగాలపై ప్రధాని మోడీ స్పెషల్ ఫోకస్!
X

దిశ‌, నేష‌న‌ల్ బ్యూరో: ఐదు దేశాల పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకమైన కేబినెట్‌ భేటీలో పాల్గొన్నారు. గురువారం రాత్రి కేంద్ర మంత్రిమండలితో నాలుగున్నర గంటలపైగా సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తొమ్మిది ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను ఈ భేటీలో ప్రధానికి సమర్పించాయి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా దేశ అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అవసరమైన పాలనా ప్రాధాన్యతలు, సంస్కరణలు, భవిష్యత్తు కార్యాచరణపై వ్యవసాయం, అడవులు, కార్మిక, రోడ్డు రవాణా, కార్పొరేట్ వ్యవహారాలు, విదేశాంగ, వాణిజ్యం, విద్యుత్ శాఖలు వివరణాత్మక ప్రెజెంటేషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరితోపాటు కేబినెట్ సెక్రెటరీ, నీతి ఆయోగ్ కూడా ప్రెజెంటేషన్స్ ఇచ్చాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. వికసిత్ భారత్ అనేది కేవలం నినాదం కాదని, అది ప్రభుత్వ కమిట్‌మెంట్ అని మంత్రులకు చెప్పినట్లు సమాచారం.

సంస్కరణలపై దిశానిర్దేశం

అన్ని శాఖల్లో పరిపాలనా సంస్కరణల ఆవశ్యకత చాలా ఉందని ప్రధాని మోడీ నొక్కిచెప్పారు. ప్రభుత్వ పాలన అనేది కేవలం ప్రజల సంక్షేమం, పౌరుల సౌకర్యం చుట్టూనే సాగాలని స్పష్టం చేశారు. ఫైళ్ల కదలికలో వేగం పెంచాలని, అనవసరమైన ఆలస్యానికి తావులేకుండా ప్రభుత్వ పనితీరులో మరింత సమర్థతను ప్రదర్శించాలని మంత్రులను ఆదేశించారు. ప్రతి స్థాయిలోనూ నిబంధనలను సరళీకృతం చేస్తూ, తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అంచనాల్లో వెనుకబడిన శాఖలు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, క్షేత్రస్థాయిలో విధానాలను బలోపేతం చేయాలని ప్రధాని సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అలాగే మంత్రులు కాంట్రవర్సీలకు దూరంగా ఉండి, ప్రజలకు ముఖ్యమైన అంశాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలని సూచించినట్లు తెలిపాయి.

పశ్చిమాసియా సంక్షోభంపై..

ఈ భేటీలో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, దాని వల్ల ఎనర్జీ రంగంపై పడుతున్న ఒత్తిడిని ప్రధాని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రజలపై ఈ ఆర్థిక ఒత్తిడి సాధ్యమైనంత తక్కువ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పిన ఆయన.. ఎనర్జీ, వ్యవసాయం, ఎరువులు, ఏవియేషన్, షిప్పింగ్, రవాణా తదితర కీలక రంగాలపై ప్రత్యేకంగా చర్చలు జరిపారని సమాచారం. అలాగే గడిచిన 12 ఏళ్ల కాలంలో ఎన్డీయే ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటనకు సంబంధించిన వివరాలను, దీంట్లో సాధించిన కీలక ఫలితాలను మంత్రిమండలికి విదేశాంగ మంత్రి జైశంకర్ వివరించారు. ఈ అంతర్జాతీయ పర్యటన విజయవంతం కావడంపై, అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయంపై కేంద్ర మంత్రులంతా ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. కాగా, ఇంధనం, రక్షణ, వాణిజ్యం, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటించిన ప్రధాని.. గురువారం నాడు ఢిల్లీ చేరుకున్నారు.

కేబినెట్ ప్రక్షాళన?

ఏడాది తర్వాత నిర్వహించిన కేంద్రమంత్రి మండలి సమావేశంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని, కొందరు మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త ముఖాలను కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే, బయటికి సమాచారం మాత్రం మంత్రుల పర్ఫార్మెన్స్, పశ్చిమాసియా సవాళ్లపై దీర్ఘ చర్చ జరిగినట్టు వస్తున్నది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై పెద్దగా సమాచారం రాలేదు. ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఒకట్రెండు నెలల్లో ఆ మార్పులు చోటుచేసుకోవచ్చనే చర్చ జరుగుతున్నది.

భారత్‌కు అవసరమైన చమురు అందిస్తాం: అమెరికా

భారత్‌కు ఎంత కావాలంటే అంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని యూఎస్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అన్నారు. శనివారం నాడు తొలిసారి భారత పర్యటనకు వస్తున్న రూబియో.. ఇండియాకు మరింత పెద్ద ఇంధన సప్లయర్‌గా మారేందుకు యూఎస్ అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో చమురు మార్కెట్‌లో అనిశ్చితి నెలకొన్న వేళ ఆయన అ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘భారత్ ఎంత కొంటే అంత ఇంధనం అమ్మాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం యూఎస్‌లో ఉత్పత్తి, ఎగుమతి చరిత్రాత్మక స్థాయిలో జరుగుతోంది. కాబట్టి మేం వారితో మరింత బిజినెస్ చేయాలనుకుంటున్నాం. దానికోసం చర్చలు కూడా కొంతకాలంగా జరుగుతున్నాయి. భారత దిగుమతుల్లో మేం మరింత పెద్ద పార్ట్ కావాలనుకుంటున్నాం’ అని చెప్పారు. భారత్ తమకు చాలాగొప్ప భాగస్వామి అని, కాబట్టి ఈ పర్యటన చాలా ముఖ్యమని అన్నారు. మే 23 నుంచి 26 వరకు భారత్‌లో మూడ్రోజులు పర్యటించనున్న రూబియో.. కోల్‌కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీని సందర్శిస్తారు. ఎనర్జీ, డిఫెన్స్, ట్రేడ్, భద్రతలో భాగస్వామ్యంపై ఈ పర్యటనలో చర్చలు జరుగుతాయని అమెరికా అధికారులు తెలిపారు. కాగా, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రొడ్రిగెజ్ వచ్చేవారం భారత్‌కు రానున్నట్టు చెప్పారు.

Next Story