Dhankhar: పార్లమెంటే సుప్రీం.. ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్

by Shamantha N |

సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Dhankhar: పార్లమెంటే సుప్రీం.. ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ చేసిన వ్యాఖ్యలు మరువక ముందే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ పరమైన అంశాల్లో సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలపై మరోసారి ప్రశ్న లేవనెత్తారు. ఈ అంశాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ‘అల్టిమేట్‌ మాస్టర్స్‌’ అని ధంకర్ పేర్కొన్నారు. ‘రాజ్యాంగ కార్యకర్త (తనను తాను ప్రస్తావిస్తూ) మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకే మార్గనిర్దేశం చేస్తారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే. ప్రజలకు రక్షణ కల్పించేందుకే ప్రజాస్వామ్యం. ఒక సందర్భంలో సుప్రీంకోర్టు ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదని చెబుతుంది. మరో సందర్భంలో అందులో భాగంగానే ఉందని చెబుతోంది. కానీ రాజ్యాంగం గురించి ఎటువంటి సందేహం లేదు. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్‌ మాస్టర్స్‌. పార్లమెంట్‌ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యంగంలో ఎక్కడా లేదు. పార్లమెంటే సుప్రీం’ అని ధంఖర్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ప్రస్తావించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు.

సుప్రీం తీర్పుపై వ్యాఖ్యలు

పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతికి గడువు విధిస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. దీనిపైనే ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ (Vice-President Jagdeep Dhankhar) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉండకూడదని వ్యాఖ్యానించారు. అలాంటి ఆదేశం దేశ అత్యున్నత కార్యాలయ రాజ్యాంగ విధిని దెబ్బతీస్తుందని అన్నారు. ఆర్టికల్ 145(3) కింద చట్టాన్ని అర్థం చేసుకునే అధికారాన్ని న్యాయవ్యవస్థకు ఇస్తుందని, కానీ కోర్టులు రాష్ట్రపతికి ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఇవ్వలేదని ఆయన అన్నారు. “రాజ్యాంగం ప్రకారం మీకు ఉన్న ఏకైక హక్కు ఆర్టికల్ 145(3) కింద రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది జడ్జిలు ఉండాలి” అని ధంఖర్ అన్నారు. మరోవైపు, ఇదే అంశంపై భాజపా ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. ‘‘ఒకవేళ సుప్రీంకోర్టు (Supreme Court) చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్‌ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story