బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా

by Gantepaka Srikanth |

బిహార్ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు.

బిహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన, తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు స్వయంగా అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో, ఎగువ సభకు ప్రాతినిధ్యం వహించాల్సి ఉన్నందున ఆయన తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడం అనివార్యమైంది. నితీష్ కుమార్ రాజీనామాను గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రాజీనామాతో బిహార్‌లో తదుపరి రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. కొత్త ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై జేడీయూ (JDU), కూటమి పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. బిహార్ సీఎంగా బీజేపీ నేత బాధ్యతలు చేపట్టనున్నారు. బీహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో తొలిసారిగా బీజేపీ తన సొంత ముఖ్యమంత్రిని నియమించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ రేసులో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సామ్రాట్ చౌదరి ముందంజలో ఉన్నారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్, ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, సమ్రాట్ చౌదరి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. మరోవైపు, బిహార్​లో ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి అయితే, దానికి తన మద్దతు ఉంటుందని జనశక్తి జనతా దళ్‌ (జేజేడీ) చీఫ్‌ తేజ్ ప్రతాప్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగే బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో సమ్రాట్ చౌదరి పేరును సీఎం పదవికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story