Bihar: నితీష్ ఎన్నికల వరాలు.. అందరికీ 125 యూనిట్ల ఉచిత విద్యుత్‌

by S Gopi |

రాష్ట్రంలోని అన్ని గృహాలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

Bihar: నితీష్ ఎన్నికల వరాలు.. అందరికీ 125 యూనిట్ల ఉచిత విద్యుత్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు వరాలు, హామీలతో ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. తాజాగా అధికార పార్టీ జేడీయూ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని అన్ని గృహాలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను ఇస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీని ద్వారా 1.67 కోట్ల ఇళ్లకు ప్రయోజనం కలిగిస్తుందని ఆయన తెలిపారు. ఆగస్టు 1 నుంచే ఈ ఉచిత విద్యుత్ అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. దీనర్థం జూలై నెల బిల్లులోనే 125 యూనిట్ల వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవని నితీష్ కుమార్ అన్నారు. మేము ఇప్పటికే వినియోగదారులకు చౌకగా విద్యుత్‌ను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇదే సమయంలో వచ్చే మూడేళ్ల కాలంలో గృహ వినియోగదారుల ప్రతి ఇంటి పైకప్పుపైనా సోలార్ పవర్ ప్లాంట్లను అమర్చనున్నట్టు సీఎం నితీష్ కుమార్ తెలిపారు. కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సోలార్ ప్లాంట్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భవిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు నితీష్ స్పష్టం చేశారు. కాగా, ప్రతిపక్ష నేత తేజీస్వి యాదవ్ తమ ఆర్జేడీ అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో నితీష్ తాజా ప్రకటన ఎన్నికలకు మరింత హీట్ పెంచింది.

Next Story