NIA arrest: ముంబై ఎయిర్ పోర్టులో కలకలం.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్

by B.Srinivas |

ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) శనివారం అరెస్ట్ చేసింది.

NIA arrest: ముంబై ఎయిర్ పోర్టులో కలకలం.. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై విమానాశ్రయంలో కలకలం రేగింది. రెండేళ్లుగా పరారీలో ఉన్న ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ (ISIS) ఉగ్రవాదులను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) శనివారం అరెస్ట్ చేసింది. ఇండోనేషియా (Indonatia) రాజధాని జకార్తా (Jakartha) నుంచి భారత్‌కు వచ్చిన వీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే అనుమానాస్పదంగా కనిపించడంతో ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ వారిని అడ్డుకున్నారు. అనంతరం ఎన్ఐఏకు సమాచారం అందించగా రంగంలోకి దిగిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులను అబ్దుల్లా ఫయాజ్ షేక్ అలియాస్ డైపర్‌వాలా, తల్హా ఖాన్‌లుగా గుర్తించారు. అనంతరం వారిని విచారించగా ఐసిస్ స్లీపర్ సెల్ విభాగంతో సంబంధాలున్నట్టు తేలింది.

అంతేగాక 2023లో మహారాష్ట్రలోని పూణేలో ఐఈడీల తయారీ, వర్క్ షాప్ నిర్వహించిన కేసులో నిందితులుగా ఉన్నారు. అప్పటి నుంచే పోలీసులు వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఇద్దరూ పరారీలో ఉండటంతో వారిపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నిందితుల సమాచారం ఇచ్చిన వారికి ఎన్ఐఏ రూ.3లక్షల నగదు బహుమతి సైతం ప్రకటించింది. అయితే రెండేళ్లుగా పరారీలో ఉన్న వీరు ముంబైకి ఎందుకు వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ కేసులో గతంలో మరో 8 మందిని అరెస్ట్ చేశారు.

Next Story