కొత్త వర్క్ రూల్స్.. ఇంజినీర్లకు సర్టిఫికేషన్ తప్పనిసరి!

by Yella Dhawani Reddy |

గల్ఫ్ దేశమైన ఒమన్‌ తమ ఉద్యోగ నియామక విధానాల్లో కీలక మార్పులు చేసింది.

కొత్త వర్క్ రూల్స్.. ఇంజినీర్లకు సర్టిఫికేషన్ తప్పనిసరి!
X

దిశ, వెబ్ డెస్క్: గల్ఫ్ దేశమైన ఒమన్‌ (Omen) తమ ఉద్యోగ నియామక విధానాల్లో కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి కొన్ని వృత్తుల వారికీ సర్టిఫికేషన్ తప్పనిసరి కానుంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ రంగంలో పనిచేసే విదేశీయులకు ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ (OSE) నుంచి క్లాసిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్క్‌పర్మిట్‌ పునరుద్ధరించుకోవడానికి ముందే దీనిని తీసుకోవాలి. ఈ సర్టిఫికేషన్ ద్వారా వ్యక్తి అర్హతలు, నైపుణ్యాలు, అనుభవం తదితర అంశాలను సాంకేతిక ప్రమాణాల ప్రకారం ధృవీకరిస్తారు. సర్టిఫికేషన్ లేని వ్యక్తులు ఉద్యోగానికి అర్హులు కారు. ఇది వీసా పునరుద్ధరణ, కొత్త వర్క్ పర్మిట్‌లకు కూడా కీలకంగా మారనుంది. దీంతోపాటు యజమానులు, విదేశీ ఉద్యోగులు వర్క్‌పర్మిట్‌ కోసం ఈపోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సరైన క్రెడెన్షియల్స్‌ లేని వారికి వర్క్‌పర్మిట్‌ జారీ లేదా పునరుద్ధరణ జరగదు.

ఇక సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి 20 రకాల అకౌంటింగ్‌, ఫైనాన్షియల్‌ విభాగాల్లో పనిచేసేవారు కచ్చితంగా ఇలాంటి ధ్రువీకరణే తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో అకౌంట్స్‌ టెక్నిషియన్స్‌, అసిస్టెంట్‌ ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్‌, అసిస్టెంట్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌, ఇంటర్నల్‌ ఆడిటర్‌, ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్‌, కాస్ట్‌ అకౌంటెంట్‌, క్రెడిట్‌ ఎనలిస్ట్‌, ఫైనాన్షియల్‌ ఎనలిస్ట్‌, అకౌంట్స్‌ మేనేజర్‌, ట్యాక్స్‌ మేనేజర్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టర్నల్‌ ఆడిట్‌ మేనేజర్‌, ఇంటర్నల్‌ ఆడిట్‌ మేనేజర్‌, సీనియర్‌ ఇంటర్నల్‌ ఆడిట్‌ మేనేజర్‌, హెడ్‌ ఆఫ్‌ ఇంటర్నల్‌ ఆడిట్‌ మేనేజర్‌, ఎక్సటర్నల్‌ ఆడిట్‌ పార్ట్‌నర్‌, చీఫ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి.

ఈ కొత్త విధానం వల్ల ఒమన్‌లో పనిచేయాలనుకునే విదేశీ ఉద్యోగులు ప్రారంభంగా సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయడం అవసరం. ఇతర దేశాల నుంచి వచ్చే ఉద్యోగులకు ఇది ఒక అదనపు అర్హతగా మారనుంది. వృత్తిగత ప్రమాణాలను మెరుగుపరచడం, నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత కల్పించడం, దేశీయ కార్మిక మార్కెట్‌ను మెరుగుపరచడం ఈ మార్పుల ముఖ్య ఉద్దేశాలు. ఇప్పటికే ఒమన్‌లో పని చేస్తున్న ఇంజినీర్లు కూడా ఈ సర్టిఫికేషన్ పొందాల్సి ఉంటుంది. అంతేగాక, కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులు ముందుగానే అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఈ మార్పులు ఒమన్‌లో వృత్తిపరమైన స్థాయిని పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఇలాంటి చర్యలే అమలు చేస్తున్నారు.

Next Story