అంధులకు చూపు తెచ్చే బ్లైండ్‌సైట్.. ఎలాన్ మస్క్ కంపెనీ కొత్త టెక్నాలజీ

by Phanindra |

అంధులకు చూపు తెచ్చే బ్లైండ్‌సైట్ చిప్‌ను ఎలాన్ మస్క్ కంపెనీ తయారు చేస్తోంది. ఈ ఏడాది మానవ ప్రయోగాలు ప్రారంభించనుంది.

అంధులకు చూపు తెచ్చే బ్లైండ్‌సైట్.. ఎలాన్ మస్క్ కంపెనీ కొత్త టెక్నాలజీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పుట్టినప్పటి నుంచి కళ్లు కనిపించని వారికి కూడా కనుచూపు తీసుకొచ్చే ఇంప్లాంట్‌ను ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ తయారు చేస్తోంది. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నుంచి 2024లోనే బ్రేక్‌త్రూ డివైజ్ అర్హత పొందిన ఈ ఇంప్లాంట్.. ఈ ఏడాదిలో హ్యూమన్ ట్రయల్స్‌కు వెళ్తుందని న్యూరాలింక్ తెలిపింది. బ్లైండ్‌సైట్ పేరుతో తయారు చేస్తున్న ఈ బ్రెయిన్ చిప్.. మెదడులోని విజువల్ కార్టెక్స్‌ను స్టిమ్యులేట్ చేయడం ద్వారా చూపునిస్తుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. గతేడాది ఈ చిప్‌ను కోతులపై పరీక్షించగా అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ఆరంభంలో చూపు కొంత మసకగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సాధారణ కంటి కంటే ఉత్తమమైన చూపును బ్లైండ్ సైట్ చిప్ అందిస్తుందని చెప్పాడీ ప్రపంచ కుబేరుడు. ఈ ఏడాది నుంచి న్యూరాలింక్ సంస్థ బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ వస్తువులను అధిక మొత్తంలో ఉత్పత్తి చేయనుందని ప్రకటించారు.

కేవలం చూపే కాకుండా, మూగ వారితో మాట్లాడించగల పరికరాలను కూడా ఈ సంస్థ తయారు చేస్తుండటం గమనార్హం. ఈ వస్తువులకు చెందిన తీగలు.. సాధారణ ఎముకల కన్నా బలంగా ఉండే పుర్రెలోని డ్యూరా, స్పైనల్ కార్డ్ నుంచి సులభంగా శరీరంలో ప్రవేశిస్తున్నాయని చెప్పిన మస్క్.. ఇది చాలా గొప్ప విషయమన్నారు. తమ చిప్‌తో పుట్టుకతో చూపు లేని వారి నుంచి ప్రమాదాల్లో కంటి చూపు కోల్పోయిన వారి వరకు అందరికీ చూపు వస్తుందన్నారు. వారి మెదడులో విజువల్ కార్టెక్స్‌ సురక్షితంగా ఉంటే చాలని, బ్లైండ్ సైట్ చిప్ ద్వారా ఇర్‌ఫ్రారెడ్, అల్ట్రావయలెట్, రాడార్ వేవ్‌లెంగ్త్‌లు కూడా చూడగలిగే అవకాశముందని ప్రకటించారు.

ఎలా పనిచేస్తుంది?

బ్లైండ్ సైట్ పరికరం కొన్న యూజర్‌ ఒక కెమెరాను ధరిస్తారు. అది తన చుట్టూ ఉన్న దృశ్యాలను క్యాప్చర్ చేసి, ఈ ఫీడ్‌ను వైర్‌లెస్‌గా మొబైల్ లేదా కంప్యూటర్‌ వంటి పరికరానికి పంపుతుంది. ఈ డేలాను ఎలక్ట్రికల్ ఇంపల్స్‌ల రూపంలోకి మార్చి, ఆ సిగ్నల్స్‌ను మెదడులో అమర్చిన బ్లైండ్‌సైట్ పరికరానికి ఈ కంప్యూటర్ పంపుతుంది. వీటికి తగినట్లు బ్లైండ్‌సైట్‌ పరికరం.. మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. సాధారణంగా కంటిలోని ఆప్టిక్ నరాలు చేసే పనినే ఈ పరికరం చేస్తుందన్నమాట. ఈ సిగ్నల్స్‌ను మన మెదడు చిత్రాల రూపంలో ప్రాసెస్ చేస్తుంది. దీంతో సదరు వ్యక్తికి తన కంటితో చూసిన అనుభవమే కలుగుతుంది.

Next Story