రైలులో ఆకతాయిల పైశాచికత్వం.. సీట్ కవర్లు చించుతూ వీడియోలు.. భగ్గుమన్న నెటిజన్లు!

by Ramesh Naini |

కదులుతున్న రైలులో కొంత మంది యువకులు దేశ సంపదను ధ్వంసం చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

రైలులో ఆకతాయిల పైశాచికత్వం.. సీట్ కవర్లు చించుతూ వీడియోలు.. భగ్గుమన్న నెటిజన్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: కదులుతున్న రైలులో కొంత మంది యువకులు దేశ సంపదను ధ్వంసం చేసిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. రైలు సీటు కవర్‌ను ఉద్దేశపూర్వకంగా చించుతూ వారు చేసిన నిర్వాకంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఫిర్యాదు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. రైలులో ప్రయాణిస్తున్న కొంత మంది యువకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిలో ఒక యువకుడు తన సీటు కవర్‌ను చేతులతో అమానుషంగా చించేస్తుండగా, పక్కనే ఉన్న మరో యువకుడు అతడిని వారించాల్సింది పోయి, నవ్వుతూ ఆ విధ్వంసాన్ని మొబైల్‌లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

నెటిజన్ల ఫైర్:

ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి విధ్వంసకర చర్యలకు పాల్పడటం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ఈ వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే అధికారులకు ట్యాగ్ చేస్తూ ఆ యువకులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఆకతాయిల తీరుపై నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ మూర్ఖులు ఇలాంటి పనులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. రైలు సీట్లను ధ్వంసం చేస్తూ ఏమాత్రం సిగ్గులేకుండా వీడియోలు తీసుకుంటున్నారు. ఇలాంటి రౌడీ మూకల పట్ల అధికారులు తగిన విధంగా వ్యవహరించి, వారికి బుద్ధి చెప్పాలి’ అని ఓ నెటిజన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరిపైనా ఉందని, ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Next Story