Odisha's KIIT: ఒడిశాలోని కిట్ యూనివర్సిటీలో మరో నేపాలీ విద్యార్థిని మృతి

by Shamantha N |

ఒడిశాలో మరో దారుణ ఘటన బయటపడింది. భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT)లో మరో విద్యార్థిని మృతిచెందింది.

Odishas KIIT: ఒడిశాలోని కిట్ యూనివర్సిటీలో మరో నేపాలీ విద్యార్థిని మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలో మరో దారుణ ఘటన బయటపడింది. భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT)లో మరో విద్యార్థిని మృతిచెందింది. కాగా.. మూడు నెలల వ్యవధిలో ఇదే క్యాంపస్ లో ఇద్దరు విద్యార్థులు చనిపోవడం కలకలం రేపుతోంది. కాగా.. చనిపోయిన యువతిని నేపాల్ వాసిగా గుర్తించారు. కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని ఖాట్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్‌గంజ్ అని పేర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో గర్ల్స్ హాస్టల్‌లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. దీంతో, యూనివర్సిటీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పోస్టుమార్టం రిజల్ట్స్ వచ్చే వరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు భువనేశ్వర్-కటక్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్ దత్తా సింగ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై క్యాంపస్ లో విద్యార్థులు నిరసన చేపట్టారు. అంతర్జాతీయ విద్యార్థుల భద్రత, సంక్షేమంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ముఖ్యంగా ఇద్దరు నేపాలీ విద్యార్థులు చనిపోవడంతో యూనివర్సిటీలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. దీంతో, విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల భద్రతను పెంచారు.

మూడు నెలల్లో రెండో కేసు..

ఇక, గత మూడు నెలల్లో కిట్ యూనివర్సిటీలో ఇద్దరు నేపాలీ విద్యార్థినిలు చనిపోవడం కలకలం రేపుతోంది. నేపాల్ విద్యార్థిని మరణించడం ఇది రెండోసారి. ఫిబ్రవరి 16న బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రకృతి లమ్సాల్ అనే నేపాల్ విద్యార్థిని కూడా ఇదే విధంగా హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో సహచర విద్యార్థి ఒకరు తనను లైంగికంగా వేధించారని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ (ఐఆర్‌వో) కు ఫిర్యాదు చేసినట్టు తర్వాత వెలుగులోకి వచ్చింది. అయితే, యూనివర్సిటీ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోలేదని, ఇది ‘తీవ్ర నిర్లక్ష్యం’ అని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) వ్యాఖ్యానించింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం తీవ్రంగా స్పందించడంతో, ఆమె మరణించిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశారు. బీజేడీ నేత, మాజీ ఎంపీ అచ్యుత సమంత స్థాపించి, నిర్వహిస్తున్న ఈ యూనివర్సిటీపై అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రభుత్వం ఏమందంటే?

కిట్ లో స్టూడెంట్ అనుమానాస్పద మృతిపై ఒడిశా సమాచార, ప్రజా సంబంధాల శాఖ స్పందించింది. విద్యార్థిని మృతిపై సంతాపం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సమగ్ర దర్యాప్తును నిర్ధారిస్తుందని "యువతి తల్లిదండ్రులకు విశ్వవిద్యాలయ అధికారులు వెంటనే మృతిపై సమాచారం అందించారు. ఈ విషాద సమయంలో రాష్ట్ర ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి మద్దతు ఇస్తుంది" అని ప్రకటనలో పేర్కొంది. నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబా కూడా ఈ ఘటనపై స్పందించారు. యువతి మృతిపై పారదర్శక దర్యాప్తును నిర్ధారించేందుకు దౌత్య మార్గాల ద్వారా వెళ్లామని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు.

Next Story