Nepo Kids: నేపాల్ లో నిప్పు రాజేసిన ‘నెపోకిడ్స్’.. భారత్ లోనూ తక్కువేమి కాదు!

by Prasad Jukanti |

నేపాల్ ఆందోళన వెనుక రాజకీయ నాయకుల వారసుల జల్సాల కోణం సంచలనంగా మారింది.

Nepo Kids: నేపాల్ లో నిప్పు రాజేసిన ‘నెపోకిడ్స్’.. భారత్ లోనూ తక్కువేమి కాదు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జెన్ జీ ఉద్యమంతో (Nepal Gen Z protests) అట్టుడికిన నేపాల్ లో పరిస్థితితులు దారిలోకి వస్తున్నాయి. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సుశీల కార్కి.. ఆరు నెలల్లో పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అయితే సోషల్ మీడియా బ్యాన్ కు వ్యతిరేకంగా మొదలైన జెన్ జీ పోరాటం అనూహ్యంగా పొలిటికల్ టర్న్ తీసుకోవడం సంచలనంగా మారింది. ముఖ్యంగా దేశంలోని పాలకులు విచ్చలవిడిగా అవినీతిని ప్రశ్నిస్తూ నెపోకిడ్స్ పై చర్చ తెరపైకి రావడం సెన్సేషన్ గా మారింది. ఆందోళనకారుల దెబ్బకు ప్రధాని కేపీ శర్మ రాజీనామా చేసినా వెనక్కి తగ్గని నిరసన కారులు నెపో కిడ్స్ (Nepo kids) ఆరోపణలు ఎదురుకొంటున్న నాయకుల ఇళ్లను టార్గెట్ చేయడం ఈ ఉద్యమంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. నేపాల్ లో రాజుకున్న జెన్ జీ ఉద్యమంలో సోషల్ మీడియా బ్యాన్ (social media ban Nepal), పాలకుల అవినీతి అంశాలే పైకి కనిపిస్తున్నా లోలోపల మరో బలమైన కారణం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 'నెపో కిడ్స్' రాజకీయ నేతల వారసుల విలాస జీవన విధానమే నేపాల్ ప్రజల కన్నెర్రకు కారణం అని ఈ ఉద్యమం అలాంటి వారినే టార్గెట్ చేసిందనే చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. నేపాల్ లో సంభవించిన పరిణామాలు ప్రపంచ దేశాల్లోని పాలకులకు హెచ్చరిక అనే టాక్ వినిపిస్తోంది.

రాజకీయ నెపొటిజంపై కన్నెర్ర:

అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల వారసుల విలాస జీవితాలు నేపాల్ జన్ జీ ఉద్యమానికి నిప్పు రవ్వగా మారింది. ఓ వైపు దేశంలో ద్రవ్యోల్బనం, ఉపాధి కోసం నిరుద్యోగ యువత కొట్టుమిట్టాడుతుంటే మరో వైపు పాలకుల వారసులు మాత్రం విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన వస్తువులు కొనుగోలు చేస్తూ లగ్జరీ కార్లు, ఫారిన్ ట్రిప్పులు వేస్తూ లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా తమ జల్సాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం అక్కడి యువతను మరింత ఆగ్రహం తెప్పించింది. ఈ నెపో కిడ్స్ జల్సాలపై చాలా కాలంగా లోలోపలే రగిలిపోతున్న ఆ దేశ యువత తాజాగా జరిగిన ఆందోళనల్లో తమ కోపాన్ని ప్రదర్శించారు. నిరసనల్లో నెపో కిడ్స్ తీరుకు సంబంధించిన వీడియోలోను నెపో కిడ్స్ యాష్ ట్యాగ్ తో వైరల్ చేశారు. వారి నివాసాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. అందులోని ఖరీదైన వస్తువులను దోచుకెళ్లిపోయారు.

మాజీ ప్రధానులు, మంత్రుల వారసులు:

నేపాల్ మాజీ ప్రధాని పుష్పకమల దహల్ ప్రచండ మనవరాలు స్మిత దహల్ ఖరీదైన హ్యాండ్ బ్యాగులు సోషల్ మీడియాలో చూపించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అలాగే నేపాల్ మాజీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి బిరోధ్ ఖతివాడా కుమార్తె శృంఖల ఖతివాడా విదేశీ పర్యటనలు, లగ్జరీ జీవనశైలి ఆందోళనకారులను ఆగ్రహం తెప్పించింది. 2018 మిస్ నేపాల్ గా నిలిచిన ఆమె కుటుంబానికి సంబంధించిన ఇళ్లును జెన్ జీ నిరసనకారులు తగలబెట్టారు. తాజా ఘటనల నేపథ్యంలో ఆమె దాదాపు 1 లక్ష ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్లను కోల్పోయింది. ఇక మాజీ న్యాయ శాఖ మంత్రి బిందుకుమార్ థాపా కుమారుడు సౌగత్ థాపా కూడా నెపో కిడ్ క్యాటగిరిలో టార్గెట్ అయ్యాడు. అతడి ఖరీదైన లగ్జరీ బ్రాండ్ ల వస్తువుల వినియోగం పై అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా కోడలు, ప్రసిద్ధ గాయని శివనా శ్రేష్ట కోట్ల విలువైన ఆస్తులు, ఖరీదైన ఫ్యాషన్ వల్ల ఆందోళనకారులు ఆమెనూ టార్గెట్ చేశారు. దేశ జనాభాలో నాలుగో వంతు మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తుంటే రాజకీయ నాయకుల వారుసులు మాత్రం ఇలా విలాసాలతో గడుపుతూ వాటిని సోషల్ మీడియాలో ప్రదర్శించుకోవడం జెన్ జీలకు పట్టరాని కోపం తెప్పించిందని అందువల్లే నేపాల్ ఆందోళనలు మరింత వేగంగా విస్తరించాయని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రకీబ్ నాయక్ ది న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

మన దేశంలోనూ నెపోటిజం:

నెపొకిడ్స్ ను టార్గెట్ చేసిన నేపాల్ జెన్ జీ ఉద్యమం భారత దేశంలోనూ నెపో కిడ్స్ పై చర్చ జరుగుతోంది. వారసత్వ రాజకీయాలు/ కుటుంబ పాలన గురించి భారత్ లో చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. రాజకీయ రంగంలోనే కాకుండా సినిమా, వ్యాపార రంగాల్లోనూ ఈ ధోరణి పెరిగిపోతోందనే టాక్ ఉంది. ముఖ్యంగా రాజకీయ వారసత్వ ఆడంబరాలకు మన పొరుగు దేశం నేపాల్ పరిణామాలు ఓ హెచ్చరిక పంపినట్లైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మన దేశంలోనూ గల్లీ స్థాయి గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి ప్రజా ప్రతినిధుల వరకు, ప్రభుత్వంలోని చిరుద్యోగి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రజల సొమ్మును దోచుకోవడంలో వెనుకాడటం లేదనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ప్రభుత్వ ఏజెన్సీల తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తులు బయటపడుతున్నాయి. కొల్లగొడుతున్న ప్రజా సొమ్ముతో వారి పిల్లలు జల్సాలు చేస్తున్నారనే విమర్శలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పేదలు మరింత పేదలుగా మారుతుంటే పాలకులు, వ్యాపారులు, అధికారుల పిల్లలు మాత్రం కోట్లకు ఎలా పడగలెత్తుతున్నారనే చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అటువంటి వారికి నేపాల్ ఆందోళనలు ఓ వార్నింగ్ లాంటిదనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

Next Story