‘తిరిగి వెళ్లిపోండి.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు’: బెంగాల్ ఫలితాలపై నవనీత్ రాణా హాట్ కామెంట్స్

by Gantepaka Srikanth |

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఉత్కంఠ రేపుతున్న వేళ, రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి.

‘తిరిగి వెళ్లిపోండి.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు’: బెంగాల్ ఫలితాలపై నవనీత్ రాణా హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ఉత్కంఠ రేపుతున్న వేళ, రాజకీయ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లక్ష్యంగా బీజేపీ మద్దతుదారు, ఎంపీ నవనీత్ రాణా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో మమత 'ఖేలా' (ఆట) ముగిసిందని, ఇక అక్కడ అభివృద్ధి పర్వం ప్రారంభం కాబోతోందని ఆమె వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ గతంలో ఇచ్చిన ‘ఖేలా హోబే’ (ఆట ఆడదాం) నినాదాన్ని ప్రస్తావిస్తూ ఆమెపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "బెంగాల్ ప్రజలు మార్పును కోరుకున్నారు. దీదీ (మమత) ఆడిన హింసాత్మక రాజకీయాల ఆట ముగిసింది (ఖేలా ఖతం). ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో అభివృద్ధి (వికాస్) మొదలవుతుంది" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. టీఎంసీ పాలనలో బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, అవినీతి పెరిగిపోయిందని నవనీత్ రాణా ఆరోపించారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు ఈ ఎన్నికల ఫలితాలే సమాధానమని ఆమె అన్నారు. మమతా బెనర్జీ నియంతృత్వ వైఖరికి స్వస్తి పలకాలని బెంగాల్ ఓటర్లు నిర్ణయించుకున్నారని, అందుకే బీజేపీకి భారీ స్థాయిలో మద్దతు లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. దీదీ పాలనలో బంగ్లాదేశ్‌ నుంచి భారీగా వలసలు జరిగాయని.. వారంతా తిరిగి వెళ్లిపోవాలని ఈ సందర్భంగా నవనీత్ రాణా పిలుపునిచ్చారు.

బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం..

కౌంటింగ్ ట్రెండ్స్‌లో బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉండటంతో నవనీత్ రాణా హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నాయకత్వంపై బెంగాల్ ప్రజలకు నమ్మకం కుదిరిందని, ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లోనే కీలక మలుపు అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెంగాల్‌లో బీజేపీ 190 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, టీఎంసీ కేవలం 97 స్థానాలకే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

Next Story