- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
National herald: సోనియా, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ హెరాల్డ్ (National herald) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (Soniya Gandhi), రాహుల్ గాంధీ (Rahul gandhi) లపై ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. వారిద్దరినీ ఏ1, ఏ2 నిందితులుగా పేర్కొంది. అంతేగాక ఈ చార్జిషీట్‌లో ఓవర్సీర్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామ్ పిట్రోడా, సుమన్ దూబేల పేర్లను సైతం నిందితుల జాబితాలో చేర్చింది. అలాగే ఇతర నిందితులుగా యంగ్ ఇండియా, డొటెక్స్ మర్చండైజ్ ప్రయివేట్ లిమిటెడ్, సునీల్ భండారీ అనే వ్యక్తి పేరు కూడా చార్జిషీట్‌లో పేర్కొంది. ఈ నెల 9న దాఖలు చేసిన ఈ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ కోర్టులోని ప్రత్యేక జడ్జి విశాల్ గోగ్నేకు సమర్పించారు. దీనిని సమీక్షించిన ఆయన ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 25కు షెడ్యూల్ చేశారు. ఈడీ తరఫు ప్రత్యేక న్యాయవాది, దర్యాప్తు అధికారి కేసు డైరీలను కోర్టు పరిశీలన కోసం సమర్పించాలని తెలిపారు. ‘ప్రాసిక్యూషన్ ఫిర్యాదును ఏప్రిల్ 25 న్యాయస్థానం సమీక్షిస్తుంది. ఈ సమయంలో ఈడీ తరపు ప్రత్యేక న్యాయవాది, దర్యాప్తు అధికారి కోర్టు సమీక్ష కోసం కేసు డైరీలను అందజేయాలి’ అని వెల్లడించారు. కాగా, సోనియా, రాహుల్‌లపై చార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి.
16 చోట్ల ఈడీ దాడులు
కాంగ్రెస్ నియంత్రణలో ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవాలని ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన కార్యాలయాల వెలుపల ఈ నెల 12న నోటీసులు అంటించింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో మొదటి చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం. గతంలో సోనియా, రాహుల్, ఖర్గేలను ఈడీ పలుమార్లు ప్రశ్నించింది. అలాగే ఢిల్లీ ముంబై, కోల్ కతా సహా 16 చోట్ల దాడులు చేసింది.
మోడీ ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం: కాంగ్రెస్
ఈడీ చార్జిషీట్‌లో సోనియా, రాహుల్ గాంధీల పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ప్రతీకార, బెదిరింపు రాజకీయాలు తప్ప మరొకటి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను జప్తు చేయడం స్పాన్సర్డ్ నేరమని అభివర్ణించారు. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం మౌనంగా ఉండబోదని తెలిపారు. సత్యమేవ జయతే అని పేర్కొన్నారు. అలాగే కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ .. ప్రధాని, హోంమంత్రి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్నారని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతీకార చర్యలో భాగంగనే కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈడీ చార్జిషీట్ ను నిరసిస్తూ బుధవారం దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
కేసు నేపథ్యం?
నష్టాల్లో ఉన్న నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను మోసం, ఆర్థిక అవకతవకల ద్వారా సోనియా, రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆక్రమించుకున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి 2012లో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి యంగ్ ఇండియన్ లిమిటెడ్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా నేషనల్ హెరాల్డ్‌ను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ (AJL)ను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. రూ.2,000 కోట్ల కంపెనీని కేవలం రూ.50 లక్షలకు కొనుగోలు చేశారని దీనిపై విచారణ చేపట్టాలని తెలిపారు. 2014లో సోనియా, రాహుల్ ఇతర నిందితులపై కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో దీనిపై కేసు నమోదు చేసిన ఈడీ 2021లో విచారణ ప్రారంభించింది. యంగ్ ఇండియన్ లిమిటెడ్‌లో సోనియా, రాహుల్ గాంధీలకు మొత్తం 38 శాతం వాటా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది.