ప్రభుత్వ కీలక పదవుల్లో 25 మంది ప్రైవేట్ రంగ నిపుణుల నియామకం

by Dishanational1 |
ప్రభుత్వ కీలక పదవుల్లో 25 మంది ప్రైవేట్ రంగ నిపుణుల నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: పాలనా సౌలభ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కెబినెట్ కమిటీ కేంద్ర ప్రభుత్వంలోని కీలక పదవుల్లో 25 మంది ప్రైవేట్ రంగ నిపుణుల నియామకానికి ఆమోదం తెలిపింది. త్వరలో ఈ కీలక పదవుల్లో వారు చేరనున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం విభాగాల్లోని ముగ్గురు జాయింట్ సెక్రటరీ, 22 డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను నియమించాలని కమిటీ నిర్ణయించింది. సాధారణంగా ఆయా పదవులకు ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇతర గ్రూప్-ఏ సర్వీసుల్లో ఉన్నవారితో భర్తీ చేస్తారు. అయితే, ప్రభుత్వ పాలనలో కొత్త నైపుణ్యం, ప్రతిభ కలిగిన వారిని ప్రవేశపెట్టేందుకే ప్రభుత్వం ఈ నియామకాలకు సిద్ధమైంది. లేటరల్ ఎంట్రీ మోడ్ విధానంగా పరిగణించే దీన్ని ప్రభుత్వ శాఖలలో ప్రైవేట్ రంగ నిపుణుల నియామకంగా పిలుస్తున్నారు. 2018లో ప్రారంభించిన ఈ పథకం ద్వారా ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో వీరు కీలక పాత్ర పోషిస్తారు. వీరిని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్‌సీ) నియామిస్తుంది. ఇప్పటివరకు 10 మంది జాయింట్ సెక్రటరీలు, 28 మంది డైరెక్టర్లు లేదా డిప్యూటీ సెక్రటరీలు ఈ విధానంలో బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం 33 మంది వివిధ శాఖల్లో ఉన్నారు.


Next Story

Most Viewed