ఆర్సీబీ స్టైల్లో నామకరణం.. కొడుకుకు ‘విరాట్’ పేరు పెట్టి వీరాభిమానం చాటుకున్న జంట!

by Ramesh Naini |   (  Updated:2026-04-12 10:50:43  IST  )

క్రికెట్ అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రపంచానికి తెలిసిందే. అందులో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లకైతే ఏకంగా గుడులు కట్టేంత ఫాలోయింగ్ ఉంటుంది.

ఆర్సీబీ స్టైల్లో నామకరణం.. కొడుకుకు ‘విరాట్’ పేరు పెట్టి వీరాభిమానం చాటుకున్న జంట!
X

దిశ, డైనమిక్ బ్యూరో: క్రికెట్ అంటే భారతీయులకు ఎంత ఇష్టమో ప్రపంచానికి తెలిసిందే. అందులో విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లకైతే ఏకంగా గుడులు కట్టేంత ఫాలోయింగ్ ఉంటుంది. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక జంట టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీపై తమకున్న వీరాభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకుంది. తమ నవజాత శిశువుకు ఏకంగా ‘విరాట్’ అని నామకరణం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పేరును వారు రివీల్ చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆర్సీబీ జెర్సీతో పేరు ప్రకటన

సాధారణంగా నామకరణ వేడుకల్లో బిడ్డ పేరును సంప్రదాయబద్ధంగా అక్షరాల్లో రాసి ప్రకటిస్తారు. కానీ, ఈ జంట మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టైల్‌ను ఎంచుకున్నారు. గౌరీ మహాదిక్ అనే యూజర్ షేర్ చేసిన వీడియో ప్రకారం.. వేదికను పూలు, లైట్లతో అందంగా అలంకరించారు. తల్లిదండ్రులు ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబయ్యారు. తల్లి బిడ్డను ఒడిలో పట్టుకోగా.. దంపతులిద్దరూ కలిసి ఒక కాన్వాస్ తాడును విప్పారు. అది తెరుచుకోగానే అందులోంచి కోహ్లీ ట్రేడ్‌మార్క్ ‘నంబర్ 18 ఆర్సీబీ జెర్సీ’ దర్శనమిచ్చింది. దానిపై ‘విరాట్’ అని రాసి ఉంది. ఆ పేరును చూడగానే అక్కడున్న బంధువులు, స్నేహితులు చప్పట్లు, కేకలతో హోరెత్తించారు.

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

బిడ్డకు విరాట్ అని పేరు పెట్టడం వెనుక కేవలం అభిమానం మాత్రమే కాదని, ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరైన కోహ్లీలో ఉండే అంకితభావం, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, విజయం కోసం తపించే తీరు తమ బిడ్డకు కూడా అలవడాలన్నదే వారి ఉద్దేశం. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘నేను చూసిన అత్యుత్తమ నామకరణ వేడుక ఇదే’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘చాలా అద్భుతంగా ఉంది’ అని మరొకరు స్పందించారు. తమ వీడియోను పోస్ట్ చేస్తూ ఈ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలను ట్యాగ్ చేయడం విశేషం.

Next Story