Musk: ఉద్యోగిగా నా సమయం ముగిసింది.. డోజ్ నుంచి వైదొలిగిన మస్క్

by Shamantha N |

అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ అధిపతి బాధ్యతల నుంచి టెస్లా అధినేత, ప్రపంచకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వైదొలిగారు.

Musk: ఉద్యోగిగా నా సమయం ముగిసింది.. డోజ్ నుంచి వైదొలిగిన మస్క్
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ అధిపతి బాధ్యతల నుంచి టెస్లా అధినేత, ప్రపంచకుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వైదొలిగారు. ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈమేరకు ఎక్స్‌లో ఓ పోర్టు పెట్టారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్‌ ఉద్యోగిగా తన సమయం ముగిసిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్‌ మిషన్‌ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు.

తొలిసారిగా ట్రంప్ కు వ్యతిరేకంగా..

ఇక, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లుని తొలిసారి వ్యతిరేకించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్‌ కేటాయించాల్సి వస్తుండడం వల్ల నిరాశ చెందానని అన్నారు. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్‌ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్‌ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ఆ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే.. డోన్ నుంచి వైదొలుగుతున్నట్లు మస్క్ ప్రకటించడం గమనార్హం. మరోవైపు, కాగా.. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్‌ గడువు పూర్తికానుంది. దీని ప్రకారమే మస్క్‌ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, మస్క్‌ వైదొలిగినప్పటికీ డోజ్‌ తన పనిని కొనసాగిస్తోందని ట్రంప్‌ గతంలోనే తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు.

Next Story