ముంబై-బెంగళూరు వందేభారత్ స్లీపర్‌.. ఈ ఏడాది చివరికి మొత్తం 12 రైళ్లు!

by Ramesh Naini |

దేశంలో దూరప్రాంత ప్రయాణాలను మరింత సులభతరం చేసే దిశగా రైల్వే శాఖ కీలక అడుగు వేసింది.

ముంబై-బెంగళూరు వందేభారత్ స్లీపర్‌.. ఈ ఏడాది చివరికి మొత్తం 12 రైళ్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో దూరప్రాంత ప్రయాణాలను మరింత సులభతరం చేసే దిశగా రైల్వే శాఖ కీలక అడుగు వేసింది. త్వరలో బెంగళూరు-ముంబై నగరాల మధ్య కొత్త ‘వందేభారత్‌ స్లీపర్‌’ రైలును ప్రవేశపెట్టేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. 2026 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 12 కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లను పట్టాలెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరు (KSR) - ముంబై (CSMT) మధ్య ఈ కొత్త స్లీపర్ రైలు నడవనుంది. ఈ సర్వీసుకు ఆమోదం తెలిపినట్లు ఏప్రిల్ 5న బెంగళూరు సెంట్రల్ బీజేపీ ఎంపీ పీసీ మోహన్‌కు రాసిన లేఖలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.

సూపర్ హిట్‌గా తొలి స్లీపర్

ఈ రైలు అందుబాటులోకి వస్తే రెండు మెట్రో నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో పాటు, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. మూడు నెలల క్రితం ప్రారంభమైన దేశపు తొలి వందేభారత్ స్లీపర్ రైలు (కామాఖ్య - హౌరా) అనూహ్య విజయం సాధించింది. కేవలం 119 ట్రిప్పుల్లోనే 100 శాతం ఆక్యుపెన్సీతో ఏకంగా 1.21 లక్షల మంది ఇందులో ప్రయాణించడం విశేషం.

నానాటికీ పెరుగుతున్న ఆదరణ

2019 ఫిబ్రవరిలో (న్యూఢిల్లీ-వారణాసి) ప్రారంభమైన వందే భారత్ రైళ్లు ఇప్పటివరకు లక్షకు పైగా ట్రిప్పులు వేసి, 9.1 కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య ఏకంగా 34 శాతం పెరగడం వందేభారత్ సేవలపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి నిదర్శనం.

Next Story