ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మృతి

by Malleboina Mahesh |

ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ ఈ రోజు ఉదయం అస్వస్థతతకు గురై మృతి చెందారు. సమాజవాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సోదరుడైన ప్రతీక్ మృతితో యాదవ్ కుటుంబంలో విషాదం నెలకొంది.

ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: సమాజవాదీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ (38) మృతి చెందారు. ఈ వార్త ఉత్తరప్రదేశ్ రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బుధవారం ఉదయం లక్నోలోని ఆయన నివాసంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. ప్రతీక్ యాదవ్ మరణ వార్త తెలియగానే సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

ప్రతీక్ యాదవ్ రాజకీయాలకు దూరంగా ఉంటూ విజయవంతమైన వ్యాపారవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. లక్నోలో అంతర్జాతీయ స్థాయి జిమ్ నడుపుతూ ఫిట్‌నెస్ రంగంలో క్రియాశీలంగా ఉండేవారు. ఆయన భార్య అపర్ణ యాదవ్ (Aparna Yadav) ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (BJP)లో కీలక నేతగా కొనసాగుతున్నారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు వైద్యులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రతీక్ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేస్తూ యాదవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

Next Story